BREAKING: తెలంగాణలో ట్రాన్స్‌పోర్ట్ శాఖ చెక్ పోస్టులు తక్షణం మూసివేత

by Prasad Jukanti |   (  Updated:2025-10-22 09:39:51  IST  )

చెక్ పోస్టు మూసివేతపై సమగ్ర నివేదిక ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని రవాణా శాఖ కమిషనర్ ఆదేశించారు.

BREAKING: తెలంగాణలో ట్రాన్స్‌పోర్ట్ శాఖ చెక్ పోస్టులు తక్షణం మూసివేత
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని చెక్ పోస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ చెక్ పోస్టులు (Transport Check Posts) తక్షణం మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్‌పోర్ట్ చెక్ పోస్టులు మూసివేయాలని రవాణా శాఖ కమిషనర్ (Transport Commissioner) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు, జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, చెక్ పోస్టుల వద్ద ఉన్న బోర్డులు, బారికేడ్లు, సిగ్నేజ్ తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇకపై చెక్ పోస్టుల వద్ద ఎవరూ ఉండరాదని, సిబ్బందిని ఇతర శాఖలకు తిరిగి నియమించాలని స్పష్టం చేశారు. చెక్ పోస్టుల వద్ద వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని సూచించారు. రికార్డులు, ఫర్నీచర్, పరికరాలు వెంటనే జిల్లా ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయానికి తరలించాలని, ఆర్థిక మరియు పరిపాలనా రికార్డులను సమన్వయం చేసి భద్రపరచాలని పేర్కొన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన ప్రకటనలు ఇవ్వడంతో పాటు చెక్ పోస్టు మూసివేతపై సమగ్ర నివేదికను ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని ఆదేశించారు. కాగా గత ఆదివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి ఆదిలాబాద్, కామారెడ్డి, కొమరం భీం జిల్లాల్లోని చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమలో తాజాగా ఈ ఉత్తర్వులు వెలువడటం ఆసక్తిగా మారింది.

Next Story