ఐఎండీ చల్లని కబురు.. తెలంగాణతో సహా ఆ రాష్ట్రాలను తాకిన నైరుతి రుతుపవనాలు

by Ramesh Naini |

భానుడి భగభగలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది.

ఐఎండీ చల్లని కబురు.. తెలంగాణతో సహా ఆ రాష్ట్రాలను తాకిన నైరుతి రుతుపవనాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భానుడి భగభగలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (India Meteorological Department) ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వెల్లడించింది.

రాష్ట్రాలకు రుతుపవనాల విస్తరణ

జూన్ 23 నాటికి తెలంగాణ, మహారాష్ట్ర (ముంబై సహా), ఒడిశాలోని మిగిలిన ప్రాంతాలతో పాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. రుతుపవనాల ఉత్తర పరిమితి ప్రస్తుతం నిజామాబాద్, పుణె, అలీబాగ్, దంతెవాడ ప్రాంతాల మీదుగా కొనసాగుతోంది. రానున్న రోజుల్లో.. మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అనుకూల పరిస్థితుల వల్ల, రాబోయే 2-3 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలోని మరిన్ని ప్రాంతాలకు, ఆ తర్వాత 3-4 రోజుల్లో ఉత్తరప్రదేశ్‌కు ఇవి వేగంగా విస్తరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వాతావరణ శాఖ హెచ్చరికలు

రుతుపవనాల రాక నేపథ్యంలో తీర, లోతట్టు ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. ముంబై, రాయ్‌గఢ్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.

మత్స్యకారులకు అలెర్ట్

సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉన్నందున, దక్షిణ మహారాష్ట్ర - గోవా తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు వచ్చి రోడ్డు, రైలు, విమాన రాకపోకలకు అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. ప్రజలు నిర్మాణాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఐఎండీ సూచించింది.

Next Story