- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెచ్చిపోతున్న అక్రమార్కులు.. జోరుగా డబుల్ రిజిస్ట్రేషన్లు
ఏనాడో ప్లాట్లుగా చేసి అమ్మేసిన భూములను నాలా కన్వర్షన్ చేయకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఏనాడో ప్లాట్లుగా చేసి అమ్మేసిన భూములను నాలా కన్వర్షన్ చేయకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది. ధరణి పోర్టల్, ఆర్వోఆర్-2020లోని లొసుగులను ఆధారంగా చేసుకొని పాస్ బుక్కులు పొందారు. ఆ తర్వాత అమ్మేసిన ప్లాట్లనే మళ్లీ వ్యవసాయ భూములుగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమార్కులకు రెవెన్యూ అధికారులు ఫుల్ సపోర్ట్ అందిస్తున్నారు. అప్పటికే రిజిస్ట్రేషన్ అయిన వాటికి.. అగ్రికల్చర్ ల్యాండ్ గా డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులకు రాస్తామని, అవసరమైతే కోర్టుకు వెళ్లాలని చెబుతుండడం గమనార్హం. కానీ చర్యలు తీసుకోవడానికి మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే ఎనిమిది లక్షల ఎకరాల్లో ఇలాంటి దందా జరిగినట్లు అంచనా. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో ఇలాంటి డబుల్ రిజిస్ట్రేషన్ల ఉదంతాలు అనేకం దర్శనమిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిసరాల్లో, ఫోర్త్ సిటీకి అత్యంత సమీపంలో ఇలాంటి దందా ఎక్కువగా జరుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
తుమ్మలూరులో..
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుమ్మలూరులో గ్యాలక్సీ టేక్ ప్లాంటేషన్ ప్రైవేటు లిమిటెడ్, సౌందర్య రియల్ ఎస్టేట్ అండ్ హౌజింగ్ ప్రైవేటు లిమిటెడ్, సాయి సాధన ప్లాంటేషన్ ప్రైవేటు లిమిటెడ్, కాకతీయ షీప్ అండ్ డెయిరీ ఫార్మ్ ప్రైవేటు లిమిటెడ్, కాంక్రీట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇండియా ఎల్ఎల్పీ వంటి కంపెనీలు లే అవుట్లు చేశాయి. 200, 300, 500 గజాల లెక్కన అమ్మేశారు. తుమ్మలూరు సర్వే నం.181లో 412, సర్వే నంబర్ 376లో 169, సర్వే నంబర్ 377లో 11, సర్వే నంబర్ 378లో 40, సర్వే నంబర్ 379లో 61, సర్వే నంబర్ 380లో 94, సర్వే నంబర్ 382లో 31, సర్వేనంబర్ 383లో 42 వంతున సేల్ డీడ్స్ అయ్యాయి. ఇంకా అనేక సర్వే నంబర్లలోని ల్యాండ్ ను లే అవుట్లు చేశారు. వేలాది సేల్ డీడ్స్ అయినట్లు ఈసీలో స్పష్టంగా తెలుస్తుంది. అయితే టేకు చెట్లు పెడతామంటూ చేసిన లే అవుట్లలో 1800 వరకు ప్లాట్లు అమ్మేశారు. కొన్నేండ్లకు ఆ పాతిన ప్లాట్ల రాళ్లను తొలగించారు. ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో యజమానులకు తెలియకుండా చేశారు. ఇప్పుడేమో పాత రికార్డుల ప్రకారం పాసు పుస్తకాలు పొంది తిరిగి అదే ల్యాండ్ ను అమ్మేస్తుంటే రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్ సైట్ లో పలు సర్వే నంబర్లలోని ల్యాండ్ ను ప్లాట్లుగా సేల్ చేసినట్లు స్పష్టంగా ఉన్నప్పటికీ, రెవెన్యూ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. సుమోటోగా పరిష్కరించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. పైగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. కోర్టుకు వెళ్లాలన్న సమాధానమిస్తున్నారు. ఈ దందా వెనుక పెద్దల హస్తం ఉండడంతోనే అధికారులు మౌనం వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆధారాలున్నా.. దాటవేత ధోరణి
మహేశ్వరం మండలంలో జోరుగా కొనసాగుతున్న డబుల్ రిజిస్ట్రేషన్లపై పూర్తి ఆధారాలు ఉన్నాయి. ప్లాట్లుగా అమ్మేసిన భూములకు పాసు పుస్తకాలు ఇచ్చేశారని తహశీల్దార్ సైదులు గుర్తించారు. అయితే ఆయన సుమోటోగా స్వీకరించి రికార్డులను సరి చేయకుండా దాటవేత ధోరణిని అవలంభిస్తున్నారనే విమర్శలున్నాయి. ప్లాట్లు, వ్యవసాయ భూములు సమాంతరంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా.. రెవెన్యూ అధికారులు అక్రమార్కులకే వత్తాసు పలుకుతున్నారు. మేం వచ్చిన తర్వాత చేయడం లేదంటూ సమర్థించుకుంటున్నారు. కానీ అంతకు ముందు చోటు చేసుకున్న అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇప్పుడు ఆ భూములను నిషేధిత జాబితాలో నమోదు చేస్తే తాము ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్తున్నారు. అక్రమాలు ఆధారాలతో సహా కనిపిస్తున్నా చర్యలేవీ తీసుకోకపోవడం వెనుక ఆంతర్యేమిటో తహశీల్దార్, ఆర్డీవోలు చెప్పాలి. ప్రస్తుతం రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రికార్డులను సరి చేసే వీలుంది. ఈ మేరకు అక్రమాల చిట్టాను కలెక్టర్ కు పంపే అవకాశం ఉంది. అయితే ఈ నివేదికను పంపిస్తే గతంలో పని చేసిన డిప్యూటీ తహశీల్దార్లు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు, తహశీల్దార్లు, పాసు పుస్తకాలు జారీ చేయడానికి తోడ్పాటునందించిన ఆర్డీవోలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే అవినీతి అధికారులు, అక్రమార్కులను కాపాడేందుకు రెవెన్యూ యంత్రాంగం తెర వెనుక తీవ్రంగా కృషి చేస్తున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హైడ్రాకు అనేక ఫిర్యాదులు..
నగర శివార్లలో ఉన్న భూముల్లో గతంలో వేసిన పంచాయతీ లే అవుట్లకు రక్షణ లేకుండా పోయిందని ఇటీవల పలువురు హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. రహదారులు, పార్కుల హద్దులు చెరిపేసి వ్యవసాయ భూములుగా మార్చేశారని, ఇదేమని అడిగితే పాసు పుస్తకాలు చూపించి తమను వెళ్లగొడుతున్నారని వాపోయారు. హైడ్రా ప్రజావాణికి 64 ఫిర్యాదులు రాగా, అందులో 60 శాతానికి పైగా పాత లే అవుట్లపైనే ఉండడం గమనార్హం. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం కొర్రెములలోని 739 నుంచి 749 సర్వే నంబర్లలో మొత్తం 149 ఎకరాల్లో జయశంకర్ ఏకశిలా కాలనీ పేరుతో 1987లో మొత్తం 2080 ప్లాట్లతో లే అవుట్ వేశారు. అయితే ఇందులోని నాలుగు సర్వే నంబర్లలోని 47 ఎకరాల భూమి మాదంటూ ఆలూరి వెంకటేష్ తో పాటు మరి కొందరు పాసు పుస్తకాలు సంపాదించి కబ్జా చేశారని బాధితులు హైడ్రా ఎదుట వాపోయారు. రిట్ పిటిషన్ 8859/2009 ద్వారా లేఅవుట్ ని బతికించుకున్నా.. మళ్లీ 7 ఎకరాలు ధరణి ద్వారా పాస్ పుస్తకం తెచ్చుకుని తమను అడ్డుకుంటున్నారని ప్రజావాణి ఫిర్యాదులో బాధితులు చెప్పారు. అయితే తమకు వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా అధికారులు గూగుల్ మ్యాప్స్ ద్వారా పరిశీలించి, సంబంధిత అధికారులకు పరిష్కార బాధ్యతలను అప్పగించారు. క్షేత్ర స్థాయిలో పరిశీలనకు సమయమిచ్చారు. అధికారికంగా రివైజ్ చేయని పక్షంలో పాత లే అవుట్ల ప్రకారమే రహదారులు, పార్కులుంటాయని స్పష్టం చేశారు.
భూభారతిలో డేటా అప్ డేట్ చేస్తేనే..
సామాన్యులు ఎవరైనా స్లాట్ బుక్ చేసుకుంటే.. సేత్వార్, ఖాస్రా పహానీ, ఈసీ అంటూ కొర్రీలు పెట్టే రెవెన్యూ అధికారులు.. పెద్దల విషయంలో మాత్రం ఉదారంగా వ్యవహరిస్తున్నారు. ప్లాట్లుగా మారిన భూములకు పాస్ బుక్కులు, డబుల్ రిజిస్ట్రేషన్ల గురించి అంతా తెలిసినా.. తప్పించుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. రికార్డుల్లో ఉన్నప్పుడు తామేం చేయాలని ఎదురు ప్రశ్నిస్తున్నారు. స్లాట్ బుక్ అయినప్పుడు రిజెక్ట్ చేసే అధికారం లేదని చెబుతున్నారు. ఎకరం రూ.కోట్లల్లో పలికే ప్రాంతాల్లో మాత్రం ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా.. డిప్యూటీ తహశీల్దార్లు, తహశీల్దార్లు, ఆర్డీవోలు కలిసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ దందా ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో డబుల్ రిజిస్ట్రేషన్ల వ్యవహారం తారాస్థాయికి చేరే ప్రమాదముంది. ఇప్పటికైనా రెండు, మూడు దశాబ్దాలక్రితం అమ్మేసిన భూముల రికార్డులను పరిశీలించి, భూ భారతిలో డేటాను మార్చాల్సిన అవసరముందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.






