అక్రమ కట్టడాలపై నోరు మెదపని అధికారులు.. చోద్యం చూస్తోన్న జీహెచ్ఎంసీ

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-09-14 02:19:27  IST  )

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చందానగర్ సర్కిల్‌లో భారీగా అక్రమ కట్టడాలు వెలుగుచూస్తున్నాయి. సర్కిల్ జీహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అక్రమ కట్టడాలపై నోరు మెదపని అధికారులు.. చోద్యం చూస్తోన్న జీహెచ్ఎంసీ
X

దిశ, శేరిలింగంపల్లి : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చందానగర్ సర్కిల్‌లో భారీగా అక్రమ కట్టడాలు వెలుగుచూస్తున్నాయి. సర్కిల్ జీహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారుల విధి నిర్వహణపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఓవైపు ఆరోపణలు, మరోవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నా.. చందానగర్ సర్కిల్ ఏసీపీ (అసిస్టెంట్ సిటీ ప్లానర్) మాత్రం ఉలుకూ పలుకు లేకుండా ‘నాకేం తెలియదు.. అంతా గత అధికారుల పాపమే’ అంటూ అక్రమ నిర్మాణాలకు సంబంధించి గత అధికారులను బాధ్యులను చేసేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. గత కొద్ది కాలంగా చందానగర్ సర్కిల్ ఏసీపీ పరిధిలోని చందానగర్, మియాపూర్, హఫీజ్‌పేట్, మాదాపూర్ డివిజన్లలో అక్రమ నిర్మాణాలు ఊపందుకున్నాయి. స్థలం తక్కువైనా తగ్గేదెలే అంటూ అవినీతి పునాదులపై అక్రమ అంతస్తులను నిర్మిస్తున్నారు. అవి అక్రమ నిర్మాణాలు అని తెలిసినా ఏసీపీ, మిగతా సిబ్బంది వాటిని నిలువరించక పోవడం చూస్తుంటే వీరి చేతివాటం కూడా అందులో ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయంపై ఏసీపీని ప్రశ్నిస్తే కుర్చీలో నుండి లేచి వెళ్లిపోవడం లేదా ఫోన్ మాట్లాడుతున్నట్టు హడావుడి చేయడం ఆయనకు పరిపాటిగా మారింది.

ఆయన రూటే సెపరేటు..

చందానగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ 21 పరిధిలోని చందానగర్, హఫీజ్‌పేట్, మియాపూర్, మాదాపూర్‌లో వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇక పాత భవనాలపై కొత్త కట్టడాలు, షెడ్లు, ఇతర వాణిజ్య భవనాల నిర్మాణాలూ విచ్చలవిడిగా సాగుతున్నాయి. వీటిలో ఎన్నింటికి అనుమతులు ఇచ్చారంటే టీపీఎస్ సెక్షన్ వద్ద లెక్కలు లేవు. మాదాపూర్‌లో మెజార్టీ భవనాలకు అనుమతులు లేవు. అలాగని ఇల్లీగల్ కట్టడాలపై చర్యలు తీసుకుంటారా? అంటే అదీ లేదు. కేవలం అప్లయ్ చేసుకున్న వారికి అనుమతులు ఇవ్వడం మినహా.. అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవడం అనేది ఓ ప్రహసనం అనే చెప్పాలి. ఏ విషయం గూర్చి ఏసీపీని ప్రశ్నించినా.. ‘నాకు తెలీదు, మా దృష్టికి రాలేదు. చూడలేదు.. మా సిబ్బందిని పంపిస్తా.. చర్యలు తీసుకుంటాం’ అంటూ దాటవేత ధోరణిని అవలంభిస్తున్నట్లు తెలిసింది. ‘చైర్మన్లు కొత్తగా వచ్చారు.. నన్నేం చేయమంటారు’ అంటూ అసహనం వ్యక్తం చేయడం ఏసీపీకి కామన్ అయిపోయింది.

సామాన్యులపై ప్రతాపం.. పెద్ద బిల్డర్లకు అండ!

జీహెచ్ఎంసీ సర్కిల్-21 టీపీఎస్ సిబ్బందిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 100 గజాల స్థలంలో చిన్నపాటి ఇళ్లు కట్టుకుందామంటే దానికి పర్మిషన్లు, సెట్‌బ్యాక్‌లు అంటూ నానా హడావుడి చేసే అధికారులు.. అక్రమ నిర్మాణాలు, ప్రజావాణి ఫిర్యాదుల పేరిట పేదల ఇండ్లను కూల్చడం ఇటీవలి కాలంలో చూశాం. కానీ సుప్రీంకోర్టులో ఉన్న భూముల అంశంలో, ఎలాంటి అనుమతులు లేని ఏరియాలో విచ్చలవిడిగా 8 అంతస్తుల అద్దాల మేడలు కడుతుంటే మాత్రం ఎందుకు మిన్నకుండి చూస్తున్నారని.. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలు ఏంటనే దానిపై చందానగర్ సర్కిల్ అధికారుల వద్ద సమాధానం లేదు. ఎవరైనా తమ భూమిలో ఇతరులు నిర్మాణాలు సాగిస్తున్నారంటూ కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెస్తే అధికారులు వాటి జోలికి వెళ్లరు. వాటిపై చర్యలు కూడా పేరుకే ఉంటాయన్న విమర్శలున్నాయి.

డీసీ, జెడ్‌సీలకు నియంత్రణ కరువు..

చందానగర్ డిప్యూటీ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన శశిరేఖ సర్కిల్‌లోని శాఖలపై ఇంకా పూర్తిస్థాయిలో పట్టు సాధించలేకపోయారని తెలుస్తున్నది. పని రాక్షసిగా పేరున్న ఆమెకు కింది శాఖల్లో సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు తలనొప్పిగా మారిందనే చెప్పాలి. టీపీఎస్ సెక్షన్‌పై వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. గతవారం ఒక్క టీపీఎస్ సెక్షన్ పైనే 11 ఫిర్యాదులు రాగా, సోమవారం నాటి ప్రజావాణిలో అదే సెక్షన్‌కు సంబంధించి 9 ఫిర్యాదులు అందాయి. ఇలా అనేక ఫిర్యాదులు, ఆరోపణలు వస్తున్నా డీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేక పోతున్నారు. ఇక శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి హేమంత్ భోర్ఖడే ఏ సెక్షన్‌పై కూడా అజమాయిషీ చేయలేకపోతున్నారనే చెప్పాలి. ఉన్నతాధికారుల వ్యవహార శైలి చూస్తుంటే ఇక్కడ బలవంతంగా విధులు నిర్వహిస్తున్నారేమో అనే అనుమానాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి.

పేదలపై ప్రతాపం చూపడం ఆపాలి : దొంతి కార్తీక్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు

చందానగర్ టీపీఎస్ అధికారులు పెద్దలను వదిలి పేదలపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. పేదలు ఇండ్లు కట్టుకుంటే ఏదో రకంగా కూలుస్తున్నారు. కానీ అయ్యప్ప సొసైటీ లాంటి ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా 8 అంతస్తులు కట్టుకుంటే సర్కిల్ అధికారులకు పట్టవా? వారిపై ఎందుకు చర్యలు తీసుకోరు. ముడుపులు తీసుకుని పెద్ద బిల్డర్లకు వంతపాడుతున్నారా? ముందు టీపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలి.

Next Story