అనుమతులు లేవు.. భద్రత అసలే లేదు: ప్లాన్‌కు విరుద్ధంగా ఇష్టారీతిన అక్రమ కట్టడాలు!

by Gantepaka Srikanth |

సూర్యాపేట పట్టణంలో అనుమతులు లేని అక్రమ నిర్మాణాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.

అనుమతులు లేవు.. భద్రత అసలే లేదు: ప్లాన్‌కు విరుద్ధంగా ఇష్టారీతిన అక్రమ కట్టడాలు!
X

సూర్యాపేట పట్టణంలో అనుమతులు లేని, ప్రమాదకరమైన భవనాల నిర్మాణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగా ఈ అక్రమ నిర్మాణాలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయి. ఖమ్మం బొమ్మ రోడ్డులో నివాస అనుమతులతో కమర్షియల్ బిల్డింగ్ నిర్మించి, సెట్‌బ్యాక్ నిబంధనలను ఉల్లంఘించారు. భవనంలో లైసెన్స్ లేని రెండు లిఫ్టులు, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మున్సిపల్ కమిషనర్ విచారణ జరిపి, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

దిశ, సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలో అనుమతులు లేని అక్రమ నిర్మాణాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కారణంగా ఈ అక్రమ నిర్మాణాలు ప్రజల ప్రాణ భద్రతకు ముప్పుగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం బొమ్మ రోడ్డు వద్ద నుంచి కొత్త బస్టాండ్ వెళ్లే మార్గమధ్యంలో రెసిడెన్షియల్ బిల్డింగ్ అనుమతులు తీసుకుని కమర్షియల్ బిల్డింగ్ నిర్మించారు. సెట్‌బ్యాక్ లేకుండానే భవన నిర్మాణం చేయడంతో ఆ భవనానికి అనుమతులు సంబంధిత శాఖలు ఎలా ఇచ్చారని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బిల్డింగ్ ప్లాన్‌కు విరుద్ధంగా అదనపు అంతస్తులు నిర్మించడం, రెసిడెన్షియల్ అనుమతులతో కమర్షియల్ కార్యకలాపాలు నిర్వహించడం జిల్లాలో సాధారణమైందని స్థానికులు చెబుతున్నారు.

నాణ్యతా లోపాలు - ప్రమాదకర లిఫ్టులు..

నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా జిల్లా కేంద్రంలో నిర్మాణాలు జరగడం వల్ల కొన్ని భవనాల్లో ఇప్పటికే పగుళ్లు కనిపిస్తున్నాయని సమాచారం. సెట్‌బ్యాక్ లేకుండా నిర్మాణాలు చేయడం వల్ల గాలి, వెలుతురు సమస్యలతోపాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ బిల్డింగ్ యజమానులు పట్టించుకోవడం లేదు. ఈ బిల్డింగ్‌లో సరైన అనుమతులు లేకుండానే లిఫ్ట్‌లు ఏర్పాటు చేసి వినియోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్ శాఖ నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా లిఫ్ట్‌లను నడపడం తీవ్ర ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. కమర్షియల్‌గా ఉపయోగిస్తున్న ఈ భవనంలో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించకపోవడం గమనార్హం. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి అవసరమైన ఎన్ఓసీ లేకుండా కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు సమాచారం.

ఫిర్యాదులపై స్పందన కరువు...

ఈ అక్రమ నిర్మాణాలపై పలుమార్లు ఫిర్యాదులు వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తనిఖీలు జరపకుండా అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంబంధిత శాఖల నుంచి అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టిన అధికారులు అటు వైపు చూసిన దాఖలలు కూడా లేవు. లిఫ్ట్‌లకు టెక్నికల్ లైసెన్స్ లేకుండానే ఉపయోగిస్తున్నా ఆ బిల్డింగ్‌ను పట్టించుకునే వారే లేరని స్థానికులు వాపోతున్నారు. అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రమాదకర భవనాలను గుర్తించి సీజ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో పెరుగుతున్న అనుమతులు లేని భవనాలు పట్టణ అభివృద్ధికి పెద్ద ముప్పుగా మారుతున్నాయి. ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖలు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

విచారణకు ఆదేశిస్తాం: మున్సిపల్ కమిషనర్ హన్మంతరెడ్డి

మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి పనులు జరిగినా సహించం. ప్రతి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని విచారణ జరిపిస్తాం. అనుమతులు లేకుండా, నిబంధనలకి విరుద్ధంగా నిర్మించిన బిల్డింగ్‌లపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైనా అనుమతులు లేని నిర్మాణాలు, అక్రమ కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే మున్సిపల్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలి. పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలి.

Next Story