- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాల్వలను పూడ్చి అక్రమ లే-అవుట్.. రాత్రి సమయాల్లో సాగుతున్న పనులు!
భువనగిరిలో యథేచ్చగా అక్రమ లే అవుట్లు వెలుస్తున్నాయి. అనుమతులు లేనివి కొన్ని అయితే వరద నీటి, మురికి కాల్వలను పూడ్చి కొందరు వెంచర్లు చేస్తున్నారు.

దిశ, యాదాద్రి కలెక్టరేట్: భువనగిరిలో యథేచ్చగా అక్రమ లే అవుట్లు వెలుస్తున్నాయి. అనుమతులు లేనివి కొన్ని అయితే వరద నీటి, మురికి కాల్వలను పూడ్చి కొందరు వెంచర్లు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల పక్కనే ఈ అక్రమ వ్యవహారం సాగుతున్నా మున్సిపల్ అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. జన సంచారం లేని సమయాల్లో కొద్ది కొద్దిగా కాల్వలను పూడ్చుతూ అక్రమార్కులు లే అవుట్ ను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నారు.
అక్రమ వెంచర్ నిర్మాణం..
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపల్ కేంద్రంలో భువనగిరి, ప్రజ్ఞాపూర్ రహదారిని ఆనుకొని కొందరు వ్యక్తులు లే అవుట్ చేస్తున్నారు. భువనగిరి భగాయత్ పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 149,152/2,153/2 లలో కొంత భాగం సుమారుగా అయిదు ఎకరాలలో వెంచర్ నిర్మాణం సాగుతుంది. కొన్ని రోజుల నుండి ఈ అక్రమ వెంచర్ నిర్మాణం పనులు సాగుతున్నాయి. ఈ సర్వే నెంబర్ల గుండా రెండు కాల్వలు భువనగిరి పెద్ద చెరువు అలుగు వైపు పారుతాయి. అయితే ఈ రెండు కాల్వల నీటి పారుదల దిశను మార్చేందుకు వెంచర్ నిర్వాహకులు ప్రయత్నం చేస్తున్నారు.
రెండు కాల్వలను పూడ్చుతూ..
ఈ వెంచర్ నిర్మాణంలో రెండు కాల్వలు వాటి ఉనికిని కోల్పోబోతున్నాయి. ఒక కాల్వ గుండా పైన ఉన్న కుంట నీరు పారుతుంది. మరొక దాంట్లో పట్టణంలోని పహాడీ నగర్ నుండి వచ్చే మురుగు నీరు కిందికి పారుతుంది. వర్షా కాలంలో ఈ రెండు కాల్వలు నిరంతరం నీటితో నిండి ఉంటాయి. ప్రస్తుతం లే అవుట్ చేస్తున్న భూమి పూర్తిగా జలమయం అయ్యి ఉంటుంది. అందువల్లే ఈ వెంచర్ నిర్వాహకులు ఈ రెండు కాల్వలను పూడ్చితే రోడ్డు ఫేస్‌కు మంచి లే అవుట్ అవుతుందని భావిస్తున్నారు. మెయిన్ రోడ్డుకు మంచి ప్లేస్ లో వెంచర్ ఉండడం వల్ల మంచి ధరలకు అమ్ముకోవచ్చు అని వెంచర్ నిర్వాహకులు ఈ నిర్వాకానికి పాల్పడుతున్నారు.
రాత్రి సమయాల్లో సాగుతున్న పనులు..
వెంచర్ నిర్వాహకులు జన సంచారం లేని సమయాల్లో కాల్వలను పూడ్చే పనులు చేస్తున్నారు. పాత ఇండ్లు కూల్చితే వచ్చే వ్యర్థాలను, ఇతర రాళ్లతో కూడిన మట్టిని మెయిన్ రోడ్డు పక్కన కుప్పలుగా పోస్తున్నారు. పోసిన మట్టిని రాత్రి సమయాల్లో జేసీబీల సహాయంతో చదును చేస్తున్నారు. రెండు కాల్వలను కొద్దికొద్దిగా మట్టితో నింపుతున్నారు. కాల్వల దిశను మార్చేందుకు పెద్ద పెద్ద పైపులు వేసేందుకు సిద్ధంగా ఉంచారు.
ఆర్డీఓ కార్యాలయం పక్కనే..
ఈ అక్రమ వెంచర్ భువనగిరి ఆర్డీఓ కార్యాలయం పక్కనే ఉంది. ఆర్డీఓ కార్యాలయం గోడను ఆనుకొని వెళ్తున్న మురికి కాల్వను మట్టితో నింపుతున్న మున్సిపల్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. చాలా రోజుల నుండి ఈ వ్యవహారం సాగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి.






