- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, పరిగి : పరిగి మున్సిపల్ పరిధిలో ఫామ్ లాండ్స్ అమ్మకాలు యథేచ్చగా సాగుతున్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న ఫామ్ హౌస్‌ల కల్చర్‌ను కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. ఒక్క గుంటను గరిష్ఠంగా రూ. ఏడు లక్షలకు అమ్మతున్నారు. అందులో పలువురు ఎలాంటి అనుమతులు లేకుండా ఫామ్ హౌస్ లు నిర్మిస్తూ మున్సిపల్ ఆదాయానికి భారీగా గండిపెడుతున్నారు.
పరిగి హైవే 163 పక్కనే...
పరిగి మున్సిపల్ పరిధిలోని సుల్తాన్ పూర్, సయ్యద్ మల్కాపూర్, పరిగిలో హైవే 163 పక్కనే జోరుగా ఫామ్ ల్యాండ్ల కల్చర్ కొనసాగుతోంది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతూ క్రయవిక్రయాలు చేస్తున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
ఈ విషయంలో కొందరు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం వాటి పై కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. మున్సిపల్ పరిధిలోని సుల్తాన్ పూర్ గ్రామ శివారులో సర్వే నెంబర్ 236లో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో కొందరు రియల్టర్లు ఫామ్ ల్యాండ్ లో అనధికార వెంచర్లు వేశారు. ఒక గుంటను రూ. ఏడు లక్షల గరిష్ట ధరతో విక్రయాలు చేస్తున్నారు. వాటిని కొనుగోలు చేసిన వాళ్లు ఫామ్ హౌస్‌లు కడుతున్నారు. ఆ ఫామ్ హౌస్ ల చుట్టూ ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్స్ నిర్మిస్తున్నారు.
నోటీసులు కూడా ఇవ్వడం లేదు..
ఈ అనధికారిక ఈ ఫామ్ ల్యాండ్లకు, ఫామ్ హౌస్ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవని పేర్కొంటూ పలువురు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కనీసం నోటీసులు కూడా ఇవ్వడం లేదని ఫిర్యాదుదారులు చెబుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినా... అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కనీస నిర్మాణ పత్రాలు లేకుండానే విద్యుత్ సరఫరా చేస్తున్న విద్యుత్ అధికారులపై తీరుపై మండల ప్రజలు మండిపడుతున్నారు.
అధికారుల మౌనం ఎందుకో..?
ఈ ఫామ్ ల్యాండ్ ల వ్యవహారంపై అప్పటి పంచాయతీ అధికారులు, ఇప్పటి మున్సిపల్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ మున్సిపల్ ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ పరిధిలో అలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని చెప్పే అధికారులు సుల్తాన్ పూర్ శివారులో ఫామ్ హౌస్ లు కడుతున్న వారిపై చర్యలు తీసుకోకుండా, మౌనంగా ఉండటానికి గల కారణం ఏంటో తెలియడం లేదు. అయితే ఫామ్ ల్యాండ్ పక్కన పొలాలు గల రైతులు ఈ విషయంలో నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఫామ్ ల్యాండ్స్ చుట్టూ ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్స్ నిర్మించడం వల్ల తమ పొలాల్లోకి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికైనా అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నోటీసులు ఇవ్వమని చెప్పాను..- వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్
సుల్తాన్‌పూర్ గ్రామ శివారులోని ఫామ్ ల్యాండ్స్‌లో ఫామ్ హౌస్‌లు కడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఫామ్ ల్యాండ్స్ చేసిన యాజమాన్యానికి నోటీసులు ఇవ్వాలని మా సిబ్బందికి చెప్పాను. వారు వెంటనే నోటీసులు అందిస్తారు. ఫామ్ లాండ్స్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.






