ఆదరిస్తే మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తాం : CM రేవంత్ రెడ్డి

by Ratna Kumari |   (  Updated:2026-02-06 16:15:31  IST  )

అన్ని కులాలు, అన్ని మతాల వారికి సమ ప్రాధాన్యతనిస్తూ, తెలంగాణాను అన్ని రంగాలలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకువెళ్తున్నామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఆదరిస్తే మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తాం : CM రేవంత్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అన్ని కులాలు, అన్ని మతాల వారికి సమ ప్రాధాన్యతనిస్తూ, తెలంగాణను అన్ని రంగాలలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకువెళ్తున్నామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వాన్ని ఆదరిస్తే మరింతగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామని అన్నారు. అధికారం చేపట్టిన రెండేళ్ళ కాలంలోనే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా కొలువుల జాతరను కొనసాగించామని గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్ ప‌ల్లి మండలం బర్దీపూర్ శివారులో శుక్రవారం నిర్వహించిన ప్రజా పాలన-ప్రగతి బాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులతో కలిసి ముఖ్యమంత్రి సాయంత్రం 4.00 గంటల సమయానికి బర్దీపూర్ చేరుకోగా.. హెలిప్యాడ్ వద్ద ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, ఇతర ప్రజాప్రతినిధులు సీ.ఎంకు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు.

సీ.ఎం శంకుస్థాపన

తెలంగాణ యూనివర్సిటీలో రూ. 20 కోట్ల అంచనా వ్యయంతో వేర్వేరుగా నిర్మించనున్న ఎస్సీ బాలుర, బాలికల హాస్టళ్ల నిర్మాణ పనులకు సీ.ఎం శంకుస్థాపన చేశారు. అలాగే, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, ఇందల్‌వాయి లో సిబ్బంది నివాస గృహాలు (స్టాఫ్ క్వార్టర్స్), అదనపు సౌకర్యాల నిర్మాణానికి సంబంధించిన పనులకు, రూ.600 కోట్లతో ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాలకు, తెలంగాణ యూనివర్సిటీలో రూ. 1.36 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి, రూ.43 కోట్లతో ఆడిటోరియం, పరిపాలనా భవనం (అడ్మిన్ బిల్డింగ్), సీఎస్‌ఈ భవనం విస్తరణకు సంబంధించిన పనులకు, రూ. 21 కోట్లతో రోడ్ల నిర్మాణం, విస్తరణ తదితర పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీలో రూ. 18 కోట్లను వెచ్చిస్తూ నూతనంగా నిర్మించిన సైన్స్ ల్యాబ్ కు ప్రారంభోత్సవం చేశారు. 1614 స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ కింద రూ. 200 కోట్ల విలువ చేసే చెక్కును పంపిణీ చేశారు. విధి నిర్వహణలో మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య, సీ.సీ.ఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబాలకు రూ. కోటి చొప్పున ఎక్స్ గ్రేషియా చెక్కులను సీ.ఎం రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా అందజేశారు.

నిజామాబాద్ అంటే తనకు ప్రత్యేక అభిమానం

ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నో ప్రత్యేకతలు కలిగిన నిజామాబాద్ జిల్లా అంటే తనకు ప్రత్యేక అభిమానమని అన్నారు. నిజామాబాద్ గడ్డ మీద నుండే ప్రజాకవి దాశరథి నా తెలంగాణా కోటి రతనాల వీణ అని నినదించారని గుర్తు చేశారు. ఇదే జిల్లా నుండి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు వంటి నిజాయితి కలిగిన మచ్చ లేని నాయకులు ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో 10 సంవత్సరాలు, కేంద్రంలో 12 సంవత్సరాలుగా అధికారంలో కొనసాగిన గత పాలకులు నిజామాబాద్ జిల్లా అభివృద్ధిని పూర్తిగా విస్మరించాయని సీ.ఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. అందుకే 1931 సంవత్సరంలోనే నిజామాబాద్ మున్సిపాలిటీగా ఏర్పాటైనప్పటికీ, స్మార్ట్ సిటీగా గుర్తింపు దక్కలేదని ఆవేదన వెలిబుచ్చారు. ఈ విషయమై స్థానిక పార్లమెంటు సభ్యుడు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వాన్ని ఆదరిస్తే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాను అన్ని రంగాలలో ప్రగతి బాట పట్టిస్తామని సీ.ఎం స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ జిల్లాకు చెందిన దివంగత నేత డి.శ్రీనివాస్ పీ.సీ.సీ అధ్యక్షుడిగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎల్పీ నేతగా ఉంటూ తమ పార్టీని రెండు పర్యాయాలు వరుసగా అధికారంలోకి తెచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ సారథ్యం, తన నాయకత్వంలో రానున్న 2029 ఎన్నికల్లోనూ ప్రజా ప్రభుత్వమే వరుసగా అధికారంకి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పోరేషన్ సహా, ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.

రూ.1045 కోట్ల నిధులను కేటాయించా..

గత రెండేళ్ళ కాలంలోనే ఉమ్మడి జిల్లాలోని మున్సిపల్ పట్టణాల అభివృద్ధి కోసం రూ.1045 కోట్ల నిధులను కేటాయించామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు, మున్సిపల్ పట్టణాలకు 17,400 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశామని సీ.ఎం వెల్లడించారు. అయితే తమ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోననే భయంతో మెజారిటీ బల్దియాలలో మేయర్లు, చైర్మన్లుగా కొనసాగిన ప్రతిపక్ష పార్టీల వారు ఆ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టకుండా ప్రగతిని అడ్డుకున్నారని ఆక్షేపించారు. ఇప్పుడు ప్రజలకు మంచి అవకాశం వచ్చిందని, మున్సిపల్ ఎన్నికలలో ప్రజా ప్రభుత్వాన్ని ఆదరిస్తే పట్టణాలు, నగరాలను మరింతగా అభివృద్ధి చేసేందుకు నూటికి నూరు శాతం ప్రభుత్వం కంకణబద్ధమై కృషి చేస్తుందని సీ.ఎం రేవంత్ రెడ్డి భరోసా కల్పించారు. నిజామాబాద్ జిల్లాకు ఎయిర్ పోర్ట్ తెస్తామని, ప్రాణహిత-చేవెళ్ళ 21(ఎ) ప్యాకేజీ పనులను పూర్తి చేయించి 2లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వసతి కల్పిస్తూ ప్రభుత్వం ఆర్టీసీ సంస్థకు రూ. 9వేల కోట్లు చెల్లించిందని, మహిళా సంఘాలకు వెయ్యి అద్దె బస్సులు అందించామని గుర్తు చేశారు. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఉచిత విద్యుత్, రాయితీపై రూ. 500 లకే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 3.17 కోట్ల మందికి ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ, రైతులకు మద్దతు ధరతో పాటు సన్నాలకు క్వింటాకు 500 చొప్పున బోనస్ తదితర వాటిని అమలు చేస్తున్నామని అన్నారు. ఇదివరకు జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల వల్లనే రైతులు పంటలు పండిస్తూ ఆత్మగౌరవంతో జీవనాలు వెళ్లదీస్తున్నారని అన్నారు. తనపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్ని లేనిపోని విమర్శలు చేసినా పట్టించుకోనని, అన్ని కులాలు, మతాలను సమన్వయము చేస్తూ తెలంగాణా రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా నెంబర్ వన్ గా తీర్చిదిద్దడమే ప్రధాన సంకల్పంతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. బహిరంగ సభలో వివిధ కార్పోరేషన్ల చైర్మన్లు తాహెర్ బిన్ హందాన్, మానాల మోహన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారద, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, అరికెల నర్సారెడ్డి పాల్గొన్నారు.

Next Story