- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రాముడు అయితే శకుని ఎవరు..? తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి నిప్పులు చెరిగారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ భుజాన తూపాకీ పెట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాల్చాడని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం అనంతరం ఆమె మీడియాతో చిట్‌చాట్ చేశారు. అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాలు తిట్టుకోవడానికే సమయం సరిపోయిందన్నారు. ఒకరి అవినీతిని ఒకరు బయటపెట్టుకున్నారని ఆరోపించారు. అలాగే.. బీఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని.. సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తానని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి తాను రాముడిని అని.. మాజీ సీఎం కేసీఆర్ రావణుడు అని అంటున్నారని.. అయితే శకుని ఎవరు అని ప్రశ్నించారు. సీఎం తానే బర్బరీకున్ని అంటే నవ్వొస్తున్నదన్ని ఎద్దేవా చేశారు. మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని పోరాటం చేస్తామని తెలిపారు. మావోయిస్టులు కూడా తమ పార్టీలోకి వస్తారని.. వారిది తమది ఒకే ఎజెండా అని వెల్లడించారు. కల్వకుర్తి నియోజకవర్గంలో కుర్మిద్దలో పెద్ద భూస్వాముల భూములు వదిలి పేద గిరిజనుల భూములు టీజీఐఐసీ గుంజుకుంటున్నదని.. త్వరలో వారికోసం పోరాటం చేస్తామని చెప్పారు. పార్టీ ఆవిర్భావానికి ముందు ఉమా భారతి సహా ఇతర పెద్దలను కలిసి ఆశీర్వాదం తీసుకుంటామన్నారు.
డిగ్రీ లెక్చరర్ పోస్టుల్లో అక్రమాలకు కుట్ర..
గ్రూప్ -1 తరహాలో డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులను తమవారికి కట్టబెట్టడానికి కుట్రలు చేస్తున్నారని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు దక్కకుండా జీవోల పేరుతో ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తున్నదని మండిపడ్డారు. డిగ్రీ లెక్చరర్ల పోస్టుల కోసం వేసిన నోటిఫికేషన్‌కు జీవో నంబర్ 4 అడ్డుగా తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో 4తోపాటు పీహెచ్‌డీ చేసిన వారికి 25 మార్కుల వెయిటేజీ, ఇంటర్వ్యూకు పది మార్కులంటూ నిబంధనలు తమ వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారని విమర్శించారు. అసలు పీహెచ్‌డీ అడ్మిషన్లే లేకుండా 25 మార్కుల వెయిటేజీ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జీవో 4ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీకి జీవో నంబర్ 104, గ్రూప్స్‌కు 29, పోలీసు ఉద్యోగాలకు 46, గురుకులాలకు 81, ఆడబిడ్డలకు రిజర్వేషన్లు రాకుండా జీవో 4ను తెచ్చారని చెప్పారు. దాదాపు 40 లక్షల కుటుంబాల్లో విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే.. ప్రభుత్వం మాత్రం వారికి న్యాయం చేసే విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. ఇంత మంది కన్నీటి గాథలు ఇలా ఉంటే...సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆటలు ఆడుతుండటం సిగ్గుచేటన్నారు. జాబ్ క్యాలెండర్, రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే.. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆరోపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమం పెట్టుకుందన్నారు. 15 లక్షల రేషన్ కార్డులు తీసేయాలని చూస్తున్నదని ఆరోపించారు. పేద ప్రజలకు మేలు చేసే రేషన్ కార్డుల విషయంలో పైశాచిక పనులను మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.






