- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పకుంటా.. కేటీఆర్ సంచలన ప్రకటన

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‍లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు (Indiramma houses) నిర్మించలేదని, ఒకవేళ నిర్మించినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని చాలెంజ్ చేశారు. మేము నిర్మించిన ఆసుపత్రులకే సీఎం రిబ్బన్లు కట్ చేస్తున్నారని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూలగొట్టడమే తెలుసు నిర్మించడం తెలియదన్నారు. ఇవాళ కూకట్‍పల్లిలో జరిగిన పార్టీ శ్రేణుల సమావేశంలో స్పెషల్ ఇంటెన్సీ రివిజన్ ఓట్ల సవరణ కార్యక్రమంపై కేటీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. దేశ ప్రజలంతా కాంగ్రెస్ అనే దరిద్రాన్ని దూరం చేసుకున్నారని, తెలంగాణలో మాత్రం ప్రజలు అధికారం ఇస్తే రెండేళ్లుగా ఆ దరిద్రం మన నెత్తిన కూర్చుందన్నారు పక్కన ఏపీలో కాంగ్రెస్ మొత్తం తుడిచిపెట్టుకుపోయిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నమోదు చేసిన దొంగ ఓట్ల పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతోపాటు ఏ ఒక్కరి ఓటు కూడా పోకుండా పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా ఉండాలని కోరారు. దీనికోసం ప్రతి బూత్ నుంచి తగిన ప్రణాళికతో ముందుకు పోవాలని కోరారు.
అధికారంలోకి వస్తే 24 గంటల త్రాగునీరు:
తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో 24 గంటల తాగునీటిని (Hyderabad 24 hours water supply) ప్రతి ఇంటికి సరఫరా చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోత, నీటి కోత తీవ్రంగా ఉండేదని, అయితే పట్టుదలతో 24 గంటల నిరంతర కరెంట్‍ను హైదరాబాద్ నగరానికి, రాష్ట్రానికి అందించిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అదేవిధంగా తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ నగరంలో ప్రతి ఇంటికి 24 గంటల సురక్షిత తాగునీరు అందిస్తామని తెలిపారు. దగ్గరుండి మరి హైదరాబాద్ నగరానికి 24 గంటల తాగునీటిని అందించేందుకు బాధ్యత నేను తీసుకుంటానన్నారు.
అడ్డగోలుగా హామీలిచ్చి మోసం:
అసెంబ్లీ ఎన్నికలప్పుడు అడ్డగోలుగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రతి వర్గాన్ని మోసం చేసింద కేటీఆర్ అన్నారు. పెన్షన్ల నుంచి మొదలుకొని.. మహిళలకు రూ.2,500 వరకు ప్రతి ఒక్క వర్గానికి.. హామీలు ఇచ్చి మోసం చేసిందని దుయ్యబట్టారు. హైదరాబాద్ నగరానికి రెండున్నర సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదన్నారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ నగరానికి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా కాంగ్రెస్ వల్లనే దెబ్బతిన్నదని, దీనితోని లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు, సెంట్రింగ్ కార్మికులకు ఉపాధి లభించకుండా పోయిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులతో పాటు సెంట్రింగ్ కార్మికుల కోసం బీమాతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని కేటీఆర్ తెలిపారు.
ఇది కేటీఆర్ హామీ:
గత పది సంవత్సరాల కాలంలో.. అభివృద్ధి లక్ష్యంగా తదేక దీక్షతో పని చేశామని, అయితే ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కష్టకాలంలో పార్టీ వెంట ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తను, నాయకుడిని గుర్తుంచుకొని తగిన అవకాశాలు కల్పిస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రతి కార్యకర్తకు నాయకుడికి ఇది తన హామీ అని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఈసారి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం డిజిటల్ రూపంలోనే నిర్వహించబోతున్నదని సభ్యత్వ నమోదుకు సంబంధించిన.. కార్యక్రమం, కమిటీల ఏర్పాటు దాదాపు 50 నుంచి 60 రోజుల పాటు కొనసాగుతుందని కేటీఆర్ తెలిపారు. సభ్యత్వ నమోదుకు సంబంధించి కూడా పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ పార్టీ తరఫున ఇస్తామని తెలిపారు.






