తార్నాకలో ఉచిత ఆరోగ్య–నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన

by Kodari Anjali |

సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ప్రతి కుటుంబానికి చేరువ కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు అన్నారు.

తార్నాకలో ఉచిత ఆరోగ్య–నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన
X

దిశ, సికింద్రాబాద్: సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ప్రతి కుటుంబానికి చేరువ కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు అన్నారు. తార్నాకలో బీజేపీ నాయకుడు శ్రీరామ్ వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత నేత్ర, ఆరోగ్య పరీక్షల శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రజా సేవే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. శిబిరంలో సుమారు 500 మందికి ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించగా, అవసరమైన వారికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. అలాగే రక్తపోటు, మధుమేహ పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి బీపీ, షుగర్, మల్టీవిటమిన్ మందులను ఉచితంగా అందజేశారు. మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజల ఆదరణే బీజేపీకి బలమని పేర్కొన్నారు. తార్నాక ప్రజలు సేవా కార్యక్రమానికి విశేష స్పందన ఇవ్వడం సంతోషకరమన్నారు. అనంతరం శిబిర నిర్వాహకుడు శ్రీరామ్ వెంకటేష్ మాట్లాడుతూ, తార్నాక ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ప్రతి కాలనీ, ప్రతి కుటుంబానికి చేరువై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, గణేష్ ముదిరాజ్, రామ్ వర్మ, పార్టీ నాయకులు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులు, మహిళలు, యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story