KTR: ప్రజెంట్ సిటీ మునుగుతుంటే ఫ్యూచర్ సిటీ కడతారట.. కేటీఆర్ సెటైర్

by Prasad Jukanti |   (  Updated:2025-09-28 06:56:50  IST  )

తెలంగాణ ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ అని అందువల్ల తాము చెప్పిన మాయమాటలను మరిచిపోతారనే భ్రమల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారని కేటీఆర్ విమర్శించారు

KTR:  ప్రజెంట్ సిటీ మునుగుతుంటే ఫ్యూచర్ సిటీ కడతారట.. కేటీఆర్ సెటైర్
X

దిశ,తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్‌ చేసిన మోసాలను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు ‘కాంగ్రెస్‌ బాకీ కార్డు’ (Congress Baaki Card) ఉద్యమానికి బీఆర్ఎస్ (BRS) శ్రీకారం చుట్టింది. ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్ పేట, సమతా కాలనీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణ ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ అని అందువల్ల తాము చెప్పిన మాయమాటలను మరిచిపోతారనే భ్రమల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారని విమర్శించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను, ప్రజలకు పడ్డ బకాయిలను బాకీ కార్డు ఉద్యమంతో గుర్తుచేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో చెంప పెట్టు లాంటి సమాధానం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ పార్టీ అరచేతిలో స్వర్గం చూపించి ఓట్లు దండుకున్నదని కేటీఆర్ ధ్వజమెత్తారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి 700 రోజులైనా ఒక్కటీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి, ఇప్పటికి ఒక్కో మహిళకు రూ.55,000 బాకీ పడ్డారని, వృద్ధులకు రూ.4,000 పెన్షన్ ఇవ్వకుండా ఒక్కొక్కరికి రూ.44,000 బాకీ ఉన్నారని తెలిపారు. అలానే విద్యార్థులకు స్కూటీ ఇవ్వలేదు కానీ, రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో అసలు అభివృద్ధే జరగడం లేదని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి వ్యాసం రాస్తే, తన నియోజకవర్గానికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు వంద కోట్లు ఇచ్చి ఆదుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ఏకంగా ప్రపంచ బ్యాంకుకే లేఖ రాశారని కేటీఆర్ చెప్పారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎలా ఉందో చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు చాలన్నారు.

జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ మంత్రులంతా టూరిస్టులే అన్న కేటీఆర్, ఎన్నికలు అయిపోగానే వాళ్లంతా గాయబ్ అవుతారన్నారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునేది బీఆర్ఎస్ నేతలే అని స్పష్టం చేశారు. ‘ప్రజెంట్ సిటీ’ వరదలతో మునుగుతుంటే, దోమలతో జనం ఇబ్బందులు పడుతుంటే, ‘ఫ్యూచర్ సిటీ’ కడతానని సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉన్న మెట్రోను రద్దుచేసి జనం లేని ఫ్యూచర్ సిటీకి కొత్త మెట్రో కడతాననడం రేవంత్ రెడ్డి చావు తెలివితేటలకు నిదర్శనమని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

Next Story