మధ్యాహ్నం 3 దాటితే అంతా ఖాళీ.. మంత్రులు సైతం అసహనం!

by Naga Rani Yarlagadda |

సెక్రెటేరియట్‌లో పనిచేస్తున్న మెజార్టీ ఐఏఎస్ అధికారులు మాత్రం మధ్యాహ్నం 3 గంటల తరువాత చాంబర్‌లో కనిపించడం లేదు. ఇంతకీ ఆ అధికారులు ఎటు వెళ్లారు?

మధ్యాహ్నం 3 దాటితే అంతా ఖాళీ.. మంత్రులు సైతం అసహనం!
X

దిశ, తెలంగాణ బ్యూరో : సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. కానీ సెక్రెటేరియట్‌లో పనిచేస్తున్న మెజార్టీ ఐఏఎస్ అధికారులు మాత్రం మధ్యాహ్నం 3 గంటల తరువాత చాంబర్‌లో కనిపించడం లేదు. ఇంతకీ ఆ అధికారులు ఎటు వెళ్లారు? ఏదైనా రివ్యూ ఉంటే వెళ్లారా? మళ్లీ ఆఫీసుకు వస్తారా? లేకపోతే ఇంటికి వెళ్లిపోయారా? అనే సమాచారం కూడా సంబంధిత పేషీ సిబ్బందికి కూడా ఉండటం లేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వివిధ పనుల కోసం వస్తున్న సందర్శకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే సహనం కోల్పోయి అధికారులకు శాపనార్థాలు పెడుతున్నారు.

విజిటింగ్ టైమ్‌లో ఆఫీసులో ఉండరా?

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సెక్రెటేరియట్‌లో ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజిటర్ అవర్స్‌ను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో సాధారణ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంట్రీ పాస్ తీసుకుని లోనికి వెళ్లేందుకు వెసులుబాటు కల్పించింది. కానీ, మెజార్టీ ఐఏఎస్‌లు ఆ సమయంలోనే చాంబర్‌లో ఉండకపోవడంతో విజిటింగ్ అవర్స్ ఉద్దేశం నీరుగారిపోతున్నది. సమస్యలను అధికారులకు చెప్పుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న సందర్శకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆవేదన చెందుతున్నారు. దీంతో ‘సార్ ఎటు వెళ్లారు? ఎప్పుడొస్తారు?’ అని అక్కడ ఉన్న పేషీ సిబ్బంది వద్ద ఆరా తీస్తే ‘సారు ఎటు వెళ్లారో మాకు తెలియదు. మళ్లీ ఏ టైమ్ కు వస్తారో రారో మాకు తెలియదు’ అంటూ సమాధానం ఇస్తున్నారని వాపోతున్నారు.

సమయపాలన పాటించని ఆఫీసర్లు

మెజార్టీ ఐఏఎస్‌లు సమయపాలన పాటించరనే విమర్శలు ఉన్నాయి. ఒకరిద్దరు మినహాయించి చాలా మంది అధికారులు 12 గంటల తర్వాతే ఆఫీసుకు వస్తుంటారని టాక్ ఉంది. కొందరు అధికారులైతే తమ శాఖ మంత్రి సెక్రెటేరియట్‌కు వస్తున్నారా? లేదా? అనే విషయం తెలుసుకుని ఆఫీసుకు వస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ జాబితాలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ హోదాలోని అధికారులే ఇద్దరు, ముగ్గురు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. వీరి పనితీరును చూసిన జూనియర్ ఐఏఎస్‌లు సైతం ఫైల్స్ ఉంటేనే ఆఫీసులకు వస్తున్నారని, లేకపోతే ఇంటి నుంచి బయటికి రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఓ స్పెషల్ సీఎస్‌ను కలవడం విజిటర్స్‌కు పెద్ద పరీక్షగా మారింది. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో అంతుచిక్కని ప్రశ్నగా మారినట్లు సెటైర్లు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరు ప్రిన్సిపల్ సెక్రెటరీ హోదాలోని ఐఏఎస్‌లు మాత్రం వారాల కొద్ది ఆఫీసులకు రారని, తమ శాఖకు సంబంధించిన రివ్యూ ఉన్నప్పుడు మాత్రమే సెక్రెటేరియట్‌కు వస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి.

‘ఫేషియల్ అటెండెన్స్’ ఎంప్లాయీస్ కేనా?

సెక్రెటేరియట్ ఎంప్లాయీస్‌కు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్‌‌ను అమల్లోకి తెచ్చారు. దీంతో ప్రతి ఉద్యోగి ఆఫీసులోనికి వచ్చే ముందు, మళ్లీ ఇంటికి వెళ్లే ముందు ఎంట్రీ పాయింట్స్ వద్ద ఏర్పాటు చేసిన మిషన్ల వద్ద ఫేషియల్ అటెండెన్స్ వేయాలి. వారంలో 3 రోజుల పాటు లేట్ అటెండెన్స్ నమోదైతే (ఉదయం పదిన్నర తర్వాత) ఒకరోజు సెలవు దినంగా పరిగణనలోకి తీసుకుని జీతాలు చెల్లిస్తున్నారు. ఎంప్లాయీస్ విషయంలో ఇంత కచ్చితంగా రూల్స్ పాటిస్తున్న ప్రభుత్వం ఐఏఎస్‌ల విషయంలో ఎందుకు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నదనే చర్చ జరుగుతున్నది. ఐఏఎస్‌లు నిర్ణీత సమయానికి ఆఫీసుకు వచ్చి పనిచేయడం, కిందిస్థాయి ఆఫీసర్లు పనితీరును నేరుగా మానిటరింగ్ చేస్తే.. ఆ శాఖలోని ఎంప్లాయీస్ అందరూ క్రమశిక్షణతో పని చేస్తారు. కానీ ఆఫీసర్లే అలా వచ్చి, ఇలా వెళ్తుంటే ఎంప్లాయీస్ సైతం ఉదయం 10 గంటలకు ఆఫీసుకు వచ్చి మిషన్ ముందు ముఖం చూపించి బయటికి వెళ్లిపోవడం, మళ్లీ సాయంత్రం 5 గంటలకు వచ్చి మరోసారి ముఖం చూపించే పరిస్థితులు వస్తాయనే చర్చ సెక్రెటేరియట్ వర్గాల్లో జరుగుతున్నది.

అవాక్కవుతున్న మంత్రులు

ఈ మధ్య ఓ సీనియర్ మంత్రి ఇతర శాఖలకు చెందిన ఐఏఎస్‌లను కలిసేందుకు ప్రయత్నం చేశారు. అందుకోసం సంబంధిత అధికారికికి ఫోన్ చేస్తే స్విచాఫ్ అని ఆన్సర్ రావడంతో సదరు ఆఫీసర్ ఎక్కడ ఉన్నారో కనుక్కోవాలని తన పీఏను ఆదేశించారు. మంత్రి ముందే ఆ పీఏ అధికారి ఆఫీసుకు ఫోన్ చేసి ఆరా తీయగా ‘సార్ 3 గంటలకు వెళ్లిపొయిండు’ అని సమాధానం రావడంతో సదరు మంత్రి అవాక్కయ్యారు. అసలు అధికారులు సెక్రెటేరియట్‌కు ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళ్తున్నారో తెలియని పరిస్థితి ఉందని ఆ మంత్రి చిరాకు పడ్డారు. ఈ పరిస్థితి సదరు సీనియర్ మంత్రికే కాకుండా, మరో ఇద్దరు, ముగ్గురు మంత్రులకు సైతం ఎదురైనట్లు తెలిసింది.

స్పెషల్ ఆఫీసుల్లో రెస్ట్?

చాలా మంది సెక్రెటరీలు సెక్రెటేరియట్‌కు అలా వచ్చి, ఇలా వెళ్లిపోతుంటారని, మిగతా సమయాన్ని కొందరు ఇంట్లో గడుపుతుంటే, ఇంకొందరు తన శాఖ పరిధిలోని డైరెక్టరేట్/కమిషనరేట్ పరిధిలోని ఆఫీసుల్లో రెస్ట్ మూడ్‌లో ఉంటుంటారనే విమర్శలు ఉన్నాయి. అందుకోసం సదరు సెక్రెటరీల కోసం అన్ని సౌకర్యాలు ఉండేవిధంగా చాంబర్లు తయారు చేయించినట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే, కీలకమైన ఫైల్స్‌ను మాత్రం అక్కడికి తెప్పించుకుని క్లియర్ చేస్తుంటారని, ఫైల్స్‌కు సంబంధించిన వ్యక్తులు సైతం అక్కడికే వచ్చి కలుస్తుంటారని టాక్. ప్రస్తుతం సెక్రెటేరియట్‌లో ఫైల్స్ మూవ్‌మెంట్ ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. కానీ, ముఖ్యమైన ఫైల్స్ ఇప్పటికీ ఫిజికల్‌గానే సర్క్యులేట్ అవుతున్నాయి. వాటిని కొందరు సెక్రెటరీలు ఇంటికి తెప్పించుకుని క్లియర్ చేస్తున్నట్లు సమాచారం.

Next Story