మట్టి కుండలు తయారు చేసిన ఐఏఎస్

by Gantepaka Srikanth |

ఆమె ఐఏఎస్ అధికారిణి.. నిత్యం పనుల్లో బిజీగా ఉంటారు. కానీ.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విద్యను నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు.

మట్టి కుండలు తయారు చేసిన ఐఏఎస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆమె ఐఏఎస్ అధికారిణి.. నిత్యం పనుల్లో బిజీగా ఉంటారు. కానీ.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విద్యను నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. అందులో భాగంగానే గురుకులాల్లోని విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ ప్రోగ్రామ్‌ ఏర్పాటు చేయగా.. మంగళవారం మల్కాజ్‌గిరి గురుకుల ఫైన్ ఆర్ట్స్ స్కూల్‌లో ఈ వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. అక్కడ మట్టి పాత్రల తయారీ శిక్షణను సైతం ఏర్పాటు చేయగా.. అక్కడికి వెళ్లి కుమ్మరితో కలిసి గురుకులాల కార్యదర్శి డాక్టర్ అలగు వర్షిణి ఓ మట్టి పాత్రను తయారు చేసే ప్రయత్నం చేశారు. అలాగే.. విద్యార్థులకు అల్లికల్లో ప్రత్యేకించి మెళకువలు నేర్పించారు.

ఈ సందర్భంగా టీజీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి డా.అలగు వర్షిణి మాట్లాడుతూ.. డబ్బులున్న శ్రీమంతులకంటే గురుకుల పాఠశాలల్లో చదివే పిల్లలే శ్రీమంతులని అన్నారు. శ్రీమంతులకు డబ్బులు ఉంటే.. వారికి మించి గురుకుల విద్యార్థులకు తెలివి, జ్ఞానం ఉంటుందన్నారు. అన్నిటికీ మించి వారి పిల్లలు చదువుకునే కార్పొరేట్ స్కూల్‌కు మించి ఇక్కడ నేర్పిస్తున్న విభిన్న రకాలైన సబ్జెక్టులు, జీవితంలో ఉన్నతంగా స్థిరపడేందుకు కావాల్సిన నైపుణ్యాలను నేర్చుకోవచ్చన్నారు.

విద్యార్థులకు కేవలం మార్కులనే ఆధారం కాదని.. నైపుణం కూడా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. పోటీ ప్రపంచంలో చాలా కంపెనీలు స్కిల్స్ ఉన్న వారికి అధిక ప్రాధాన్యంతోపాటు మంచి ప్యాకేజీ ఇస్తున్నారని తెలిపారు. చదువుతోపాటు ఎక్స్‌ట్రా కర్క్యూలర్‌ యాక్టివిటీస్‌లోనూ చురుగ్గా ఉండాలన్నారు. స్కూల్ దశలోనే ఏదైనా సోషల్ సర్వీస్‌లో పాల్గొనాలని సూచించారు. గురుకులాల్లో ఈ వేసవిలో 9 విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రెటరీ సక్రునాయక్, స్టేట్ ఆఫీసర్ భీమయ్య, జోనల్ ఆఫీసర్ రజని, విద్యారాణి, నిర్మల, ప్రిన్సిపాల్ రాము, వైస్ ప్రిన్సిపాల్ గొల్లబోయిన రాములు తదితరులు పాల్గొన్నారు.

Next Story