- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాకు మంత్రి పదవే కావాలి.. హాట్ టాపిక్‌గా ఎమ్మెల్యే ‘కొక్కిరాల’ తీరు
నామినేటెడ్ పదవి వద్దు.. మంత్రి పదవే ముద్దు అన్న చందంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు తీరు.

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు వ్యవహారం పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి తనకు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ జిల్లా, సామాజిక సమీకరణాల కారణంగా అవకాశం దక్కలేదు. దీంతో ఆయన్ను సంతృప్తి పరిచేందుకు ‘సివిల్ సప్లయీస్’ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కేటాయించారు. కానీ ఇప్పటిదాకా ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. ప్రస్తుతం కొక్కిరాల మౌనంగా ఉండిపోయారు. చైర్మన్ పదవి వద్దు.. మంత్రి పదవి కావాలని భీష్మించి కూర్చున్నారు. ‘నాకు కార్పొరేషన్ చైర్మన్ పదవి వద్దు.. మంత్రి పదవి మాత్రమే కావాలి. ఒకవేళ ఆ పదవి ఇవ్వకుంటే ఖాళీగానైనా ఉంటా.. కానీ నామినేటెడ్ పదవి బాధ్యతలు తీసుకోను. ఈ విషయాన్ని పార్టీ, ప్రభుత్వంలోని పెద్దలకూ చెప్పా..’ అని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తన సన్నిహితులకు వివరించినట్లు తెలిసింది.
కేబినెట్ హోదా ఇచ్చినా కినుక..!
మంత్రి పదవి కోసం ఆశలుపెట్టుకున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి గతేడాది అక్టోబర్ 31న ప్రభుత్వ సలహాదారు(కేబినెట్ హోదా)పదవి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ (కేబినెట్ హోదా) పదవి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. వెంటనే సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన కేబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవుతున్నారు. కానీ ప్రేమ్ సాగర్ రావు మాత్రం ఇప్పటివరకు సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ బాధ్యతలు చేపట్టలేదు. మోకాలు నొప్పితో బాధపడుతున్న ఆయన అప్పట్లో కేరళలో చికిత్స పొందారు. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తారని అంతా భావించారు. కానీ ఆయన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత సైతం కార్పొరేషన్ బాధ్యతలు తీసుకోకుండా మౌనంగా ఉండిపోయారు.
ఫలించని రాయభారం
రోజులు గడుస్తున్నా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి తీసుకోకపోవడంతో ప్రభుత్వం, పార్టీలోని కీలక నేతలకు అనుమానం కలిగింది. చైర్మన్ గా బాధ్యతలు చేపట్టేలా ఆయనను ఒప్పించాలని కొందరు నేతలకు బాధ్యతలు అప్పగించారు. వారు నేరుగా ప్రేమ్ సాగర్ తో మాట్లాడారు. ఆలస్యం చేయడంతో తప్పుడు సంకేతాలు వెళ్తాయని, చార్జ్ తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. కానీ ప్రేమ్ సాగర్ రావు మాత్రం తనకు మంత్రి పదవి మాత్రమే కావాలని, కార్పొరేషన్ చైర్మన్ పదవి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం కేబినెట్ లో సీఎం రేవంత్ రెడ్డి కాకుండా 15 మంది మంత్రులు ఉన్నారు. మరో రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీచేసే క్రమంలో తనకూ మంత్రి పదవి ఇవ్వాలని ప్రేమ్ సాగర్ రావు ఏఐసీసీ నేతలకు చెప్పినట్లు సమాచారం.






