మీలాగా ఫామ్‌హౌజ్‌లో నిద్ర పోవడం లేదు : కేటీఆర్ వ్యాఖ్యలపై భట్టి ఫైర్

by Muthe.Rajitha |

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

మీలాగా ఫామ్‌హౌజ్‌లో నిద్ర పోవడం లేదు : కేటీఆర్ వ్యాఖ్యలపై భట్టి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కొన్ని చోట్ల చెరువు కట్టలు తెగి, పొలాలు కొట్టుకుపోగా... అనేక గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. గత రాత్రి నుంచి ఒక్క కామారెడ్డిలో 49 సెంటీమీటర్లకు పైగా వర్షం పడింది. రోడ్లు, రైల్వే ట్రాకులు కొట్టుకు పోయాయి. అయితే ఈ వరద విలయంపై బీఆర్ ఎస్ నేత కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసారు. వర్షాలతో, వరదలతో ప్రజలు అతలాకుతలం అయితే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

తమ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తెచ్చారని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. భారీ వర్షాలు, వరదలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని తెలియజేసారు. సీఎం, మంత్రులు అనుక్షణం అప్రమత్తంగా ఉన్నామని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రతిక్షణం తాము ప్రజల కోసమే పనిచేస్తున్నామని, నిమిష నిమిషానికి పరిస్థితిని అధికారుల ద్వారా సీఎం ఆరా తీస్తున్నారని తెలిపారు.

నిన్న బీహార్ వెళ్తే సాయంత్రం వరకు హైదరాబాద్ కు వచ్చారని, అన్ని జిల్లాల అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారని చెబుతూ.. మా సీఎం ఏమైనా ఫామ్‌హౌజ్‌లో నిద్రపోతున్నారా అని ఫైర్ అయ్యారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వాళ్ళ లాగా మేము ఇంట్లో కూర్చోలేదని, అన్ని జిల్లాల ఇంచార్జులు, మంత్రులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ.. అవసరమైన సూచనలు చేస్తున్నారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Next Story