నేను మీ సోదరుడిని మీ ఆశీర్వాదం కావాలి.. ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |

ఎల్బీ స్టేడియంలో జరిగిన ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మైనార్టీల సంక్షేమం, 4 శాతం రిజర్వేషన్లపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

నేను మీ సోదరుడిని మీ ఆశీర్వాదం కావాలి.. ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమ ప్రభుత్వం మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమంలో మైనార్టీలకు సింహాభాగం ఇచ్చి అభివృద్ధి వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఇవాళ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో (Iftar Party) సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రంజాన్ పవిత్ర మాసం సమాజంలో సఖ్యత, సోదర భావం పరిఢవిల్లాలి అని ఆకాంక్షించారు. ఈ ప్రభుత్వం మీది, నేను మీ సోదరుడిని మనమంతా కలిసి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్దాం అని పిలుపునిచ్చారు. మీ అందరి ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి అవసరం అన్నారు.

మీకు అండగా ఉంటాం:

ఇవాళ వందలాది మంది మైనార్టీ యువతీ యువకులకు విద్యా, ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయంటే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలకు తీసుకువచ్చిన 4 శాతం రిజర్వేషన్లే కారణం అని సీఎం అన్నారు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ద్వారా ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. ప్రపంచంలో యుద్ధ పరిస్థితులు చూస్తున్నాం. భారత్‍లోని మన మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తారు. ఆ మాయలో మనం పడవద్దని అందరం కలిసి తెలంగాణను దేశంలోనే అభివృద్ధి పథం వైపు నడిపే ప్రయత్నం చేద్దామన్నారు. మైనార్టీల కోసం ఈ ప్రభుత్వం ఎంత వరకు అండగా ఉండాలో అంత వరకు అండగా ఉంటామన్నారు. మైనార్టీ నేత అజారుద్దీన్ ను మంత్రి వర్గంలోకి తీసుకున్నామని, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన షబ్బీర్ అలీనీ ప్రభుత్వ సలహాదారుగా, 8 మంది మైనార్టీలను వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించుకున్నామని క్రీడాకారులు సిరాజ్, నిక్కత్ జరీన్ ను గౌరవించుకున్నామని చెప్పారు. ఈ ఇఫ్తార్ విందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు.

Next Story