హైటెక్ సిటీలో హైడ్రా భారీ ఆపరేషన్.. రూ.2,200 కోట్ల విలువైన 11 ఎకరాల భూమి స్వాధీనం

by Kema Shiva Kumar |

నగరంలోని చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తున్న హైడ్రా (HYDRAA) నగర పరిధిలోని మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ సమీపంలో భారీ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆపరేషన్ నిర్వహించింది.

హైటెక్ సిటీలో హైడ్రా భారీ ఆపరేషన్.. రూ.2,200 కోట్ల విలువైన 11 ఎకరాల భూమి స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: నగరంలోని చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తున్న హైడ్రా (HYDRAA) నగర పరిధిలోని మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ సమీపంలో భారీ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ క్రమంలో ఖానామెట్ గ్రామ పరిధిలోని మొండికుంట చెరువు పరిసరాల్లో అక్రమంగా ఆక్రమించిన 11 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 2,200 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఫిద్యాదుతో రంగంలోకి..

మొండికుంట చెరువు (Mondikunta Cheruvu) ఆనుకుని ఉన్న సర్వే నెం.53, 55 ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు వెలిసినట్లుగా ‘హైడ్రా ప్రజావాణి’ ద్వారా అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, రెవెన్యూ, GHMC అధికారులతో క్షేత్రస్థాయి విచారణకు ఆదేశించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా వందలాది తాత్కాలిక షెడ్లు, 30కి పైగా వాణిజ్య దుకాణాలను కూల్చివేశారు. చెరువు ఎఫ్‌టీఎల్ (FTL) పరిధిలో ఉన్న ఒక ఆలయ ప్రహరీ గోడను సాకుగా చూపి, ఆ చుట్టుపక్కల భూమిని కబ్జాదారులు ఆక్రమించారు. ఇక్కడ మెకానిక్ షెడ్లు, ఐరన్, స్టీల్ దుకాణాలను ఏర్పాటు చేసి, రూ.నెలకు లక్ష అద్దె వసూలు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు.

శాటిలైట్ ఆధారాలతో నిర్ధారణ..

ఈ ఆక్రమణలను నిర్ధారించేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) నుంచి సేకరించిన శాటిలైట్ చిత్రాలను అధికారులు వినియోగించారు. గత నెల జనవరి 31న నిర్వహించిన విచారణలో ఆక్రమణదారులు, రెవెన్యూ అధికారుల సమక్షంలోనే ఈ భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. బాధితులకు తగిన సమయం ఇచ్చిన తర్వాతే, భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. అయితే, అక్రమ నిర్ణాణాలపై హైడ్రా తీసుకున్న నిర్ణయంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. స్వాధీనం చేసుకున్న 11 ఎకరాల భూమిలో పార్కులను అభివృద్ధి చేయాలని, మొండికుంట చెరువును సుందరీకరించి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని అధికారులను కోరారు.

Next Story