హైడ్రాతో చేతులు క‌లిపిన స్థానికులు.. ఆ చెరువు చుట్టూ నిఘా..

by Gantepaka Srikanth |

హైడ్రాతో చేతులు క‌లిపిన స్థానికులు.. ఆ చెరువు చుట్టూ నిఘా..

హైడ్రాతో చేతులు క‌లిపిన స్థానికులు.. ఆ చెరువు చుట్టూ నిఘా..
X

దిశ, వెబ్‌డెస్క్: ప‌క్షుల కిల‌కిల‌రావాల‌తో.. వ‌ల‌స‌ప‌క్షుల విడిదితో ఆహ్లాదంగా ఉన్నప్ర‌గ‌తిన‌గ‌ర్ (Ambeer Lake)చెరువు దుర్గంధ‌భ‌రితంగా మారిపోయింది. వ్య‌ర్థాల డంపిగ్ యార్డుగా త‌యారై ఆహ్లాదం ఆన‌వాళ్లు లేకుండా త‌యార‌య్యింది. ఇప్పుడా చెరువును ప‌రిర‌క్షించేందుకు హైడ్రా(Hydraa) న‌డుం బిగించింది. ఆహ్లాదం ఆవిరై.. దుర్గంధ‌భ‌రితంగా మారిన చెరువును కాపాడేందుకు రంగంలోకి దిగింది. చెరువు ఒడ్డున పేరుకుపోయిన వ్య‌ర్థాల‌ను తొల‌గించ‌డం సోమ‌వారం ప్రారంభించింది. ఇప్ప‌టికే 30 ట్ర‌క్కుల చెత్త‌ను తొల‌గించింది. మ‌రో 30 ట్ర‌క్కుల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా వేసింది. ఒక‌టిరెండు రోజుల్లో మొత్తం అక్క‌డి వ్య‌ర్థాల‌ను తొల‌గించ‌డానికి ఏర్పాట్లు చేసింది. కూక‌ట్‌ప‌ల్లి - ప్ర‌గ‌తిన‌గ‌ర్‌ల‌ను క‌లుపుతూ ప్ర‌గ‌తిన‌గ‌ర్ చెరువు మ‌ధ్య‌లోంచి వేసిన రోడ్డుకు ఇరువైపులా వ్య‌ర్థాల‌ను తొల‌గించి.. భ‌విష్య‌త్తులో అక్క‌డ చెత్త వేయ‌డానికి వీలు లేకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల‌ని హైడ్రా నిర్ణ‌యించింది.

స్థానికుల స‌హ‌కారంతో..

169 ఎక‌రాల వ‌ర‌కూ ఉండే ప్ర‌గ‌తిన‌గ‌ర్ చెరువు ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణాన్ని అనుభ‌వించిన స్థానికులు ప్ర‌స్తుత ప‌రిస్థితిని చూసి ఆవేద‌న చెందారు. చెరువు మ‌ధ్య‌లో ఉన్న‌ రోడ్డు పొడవునా చికెన్‌, మాంసం, చేపల విక్రేతలు వ్యర్థాలను పడేస్తున్నారని హైడ్రాకు ఫిర్యాదు చేశారు. జంతు వ్యర్థాలను ఇలా డంప్ చేయడం వల్ల దుర్వాసన మరియు నీటి వనరు కాలుష్యం ఏర్పడింది. ఫ‌ర్ ఏ బెట‌ర్ సొసైటీ ప్ర‌తినిధులు కూడా ఈ చెరువు ప‌రిర‌క్ష‌ణ కోసం అలుపెర‌గ‌ని పోరాటం చేస్తోంది. ఈ చెరువును క‌బ్జాల నుంచి కాపాడ‌డంతో పాటు.. ప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణం ఉండేలా చూడాల‌ని వీరంతా హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ను ఆశ్ర‌యించారు. స్థానిక ప్రజలు/ప్రజా సంఘాలు మొదలైన వారి భాగస్వామ్యంతో మాంసం అమ్మే దుకాణాలను సమీపంలోని ప్రదేశానికి (ప్రస్తుత రోడ్డు వైపు నుండి) మార్చడానికి కూడా ప్రయత్నిస్తోంది.

చెరువు చుట్టూ నిఘా..

న‌గ‌రంలో చెరువుల అభివృద్ధిని ఇప్ప‌టికే ప్రారంభించిన హైడ్రా.. స్థానికుల విజ్ఞ‌ప్తి మేర‌కు ప్ర‌గ‌తిన‌గ‌ర్ చెరువు ప్ర‌గతిపై దృష్టి పెట్టింది. చెరువులో నాన్ వెజ్ వ్య‌ర్థాలు వేయ‌కుండా నిఘా పెట్టింది. నాలుగు వెహిక‌ల్స్‌ను ప‌ట్టుకుని కేసులు పెట్టింది. సీసీ టీవీ కెమేరాల‌ను ఏర్పాటు చేసి ప‌ర్య‌వేక్ష‌ణ చేప‌డుతోంది. స్థానికులు కూడా హైడ్రాతో చేతులు క‌లిపారు. మ‌రి కొద్ది రోజుల్లో ప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణం క‌నిపించ‌నుంద‌ని స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Next Story