సున్నం చెరువు FTL మార‌దు.. ఎమ్మెల్యే మాధ‌వ‌రం ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన హైడ్రా

by Gantepaka Srikanth |

మాదాపూర్‌లోని సున్నం చెరువు ఎఫ్‌టీఎల్‌(ఫుల్ ట్యాంక్ లెవెల్‌) ప‌రిధి మార‌ద‌ని హైడ్రా స్పష్టం చేసింది. ఎంతో శాస్త్రీయంగా, పార‌ద‌ర్శకంగా హ‌ద్దులు నిర్ధారించి చెరువు అభివృద్ధి ప‌నులు చేప‌డుతున్నామ‌ని హైడ్రా తేల్చి చెప్పింది.

సున్నం చెరువు FTL మార‌దు.. ఎమ్మెల్యే మాధ‌వ‌రం ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన హైడ్రా
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాదాపూర్‌లోని సున్నం చెరువు ఎఫ్‌టీఎల్‌(ఫుల్ ట్యాంక్ లెవెల్‌) ప‌రిధి మార‌ద‌ని హైడ్రా స్పష్టం చేసింది. ఎంతో శాస్త్రీయంగా, పార‌ద‌ర్శకంగా హ‌ద్దులు నిర్ధారించి చెరువు అభివృద్ధి ప‌నులు చేప‌డుతున్నామ‌ని హైడ్రా తేల్చి చెప్పింది. 2014 మే నెలలోనే ఈ చెరువు ఎఫ్‌టీఎల్ నిర్ధార‌ణ ప్రాథ‌మికంగా జ‌రిగింద‌ని.. ఆ మేర‌కే ప‌నులు చేప‌డుతున్నామ‌ని స్పష్టం చేసింది. సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ హ‌ద్దులు మార్చి అభివృద్ధి చేస్తున్నార‌ని కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు ఆరోపించ‌డాన్ని హైడ్రా ఖండించింది. పెద్దల‌ను కాపాడ‌డం కానీ.. పేద‌ల‌కు అన్యాయం చేయ‌డం కానీ ఉండ‌ద‌ని స్పష్టం చేసింది. క‌బ్జాల‌కు గురై 14 ఎక‌రాల‌కు బ‌క్కచిక్కిన ఈ చెరువును 2014లో ఇరిగేష‌న్ శాఖ నిర్ధారించిన మాదిరి 31 ఎక‌రాల‌కు విస్తరించ‌డం జ‌రిగింద‌ని హైడ్రా పేర్కొంది.

ఇరిగేష‌న్‌, రెవెన్యూ ఇలా సంబంధిత శాఖ‌లతో క‌లిసి చెరువు ఎఫ్టీఎల్ నిర్ధార‌ణ ఎంతో పార‌ద‌ర్శకంగా హైడ్రా చేసింది. సోమ‌వారం సున్నం చెరువును సంద‌ర్శించిన ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావుకు అంద‌రి సమ‌క్షంలోనే ఇరిగేష‌న్ అధికారులు స్ప‌ష్టం చేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా హైడ్రా గుర్తు చేసింది. జియో కోఆర్డినేట్స్ (భూమిపై స్థానాన్ని తెలిపే అక్షాంశ రేఖాంశాలు) ప్ర‌కారం 2014లో ఇరిగేష‌న్ శాఖ నిర్ధారించిన మేర‌కే చెరువు ఎఫ్‌టీఎల్ హ‌ద్దులు నిర్ధారించి అభివృద్ధి ప‌నులు చేస్తున్న‌ట్టు హైడ్రా స్ప‌ష్టం చేసింది. చెరువు ఎఫ్‌టీఎల్ హ‌ద్దులు శాశ్వ‌త‌మ‌నే విష‌యాన్ని గుర్తించాల‌ని కోరింది.

Next Story