Hydraa: సేవ సేమ్ టూ సేమ్‌.. డ్యూటీ డ్రెస్ ఉండ‌దంతే

by Gantepaka Srikanth |

ప్రకృతి వైప‌రీత్యాలు సంభ‌వించిన‌ప్పుడు యువ ఆప‌ద మిత్రులు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు ఒకే ర‌క‌మైన విధులు నిర్వహిస్తారు.

Hydraa: సేవ సేమ్ టూ సేమ్‌.. డ్యూటీ డ్రెస్ ఉండ‌దంతే
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకృతి వైప‌రీత్యాలు సంభ‌వించిన‌ప్పుడు యువ ఆప‌ద మిత్రులు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు ఒకే ర‌క‌మైన విధులు నిర్వహిస్తారు. డీఆర్ ఎఫ్ వాళ్లు డ్యూటీ డ్రెస్ వేసుకుంటారు.. యువ ఆప‌ద మిత్రులు రోజూ వేస‌కునే దుస్తులు ద‌రిస్తారు. సేవ‌ల‌న్నీ సేమ్ టు సేమ్ అని హైడ్రా(Hydraa) అడిష‌న‌ల్ డైరెక్టర్ వ‌ర్ల పాప‌య్య అన్నారు. విపత్తుల సమయంలో తమను తాము కాపాడుకోవ‌డ‌మే కాకుండా.. చుట్టుపక్కల ఉన్నవారిని కూడా రక్షించాలనే లక్ష్యంతో హైడ్రా ఆధ్వర్యంలో ఫతుల్గూడలో నిర్వహించిన ‘యువ ఆపద మిత్ర’ పథకం రెండో బ్యాచ్ శిక్షణను ప్రారంభించిన అనంత‌రం మాట్లాడారు. వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి వివిధ క‌ళాశాల‌ల‌కు చెందిన మొత్తం 103 మంది విద్యార్థులు హాజరుకావడం ఎంతో ఆనందకరమని తెలిపారు.

అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వాలి

మన గురించి, మన కుటుంబం కోస‌మే కాకుండా.. మన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచించినప్పుడే జీవితానికి నిజమైన అర్థం ఉంటుంది అని అన్నారు. చ‌దువు, వృత్తి నైపుణ్యంలో భాగంగా.. అనేక అంశాల‌లో శిక్షణ తీసుకుంటారు.. అది మీ భ‌విష్యత్ కోసం. కాని యువ ఆప‌ద మిత్రులుగా ఇప్పుడు తీసుకుంటున్న శిక్షణ ప‌రుల‌కోసం.. అయినా మీరంతా ఎంతో సంతోషంగా ముందుకు రావ‌డం చాలా మంచి ప‌రిణామం అని అన్నారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడమే కాకుండా, అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వాలన్నారు. విపత్తుల సమయంలో సహచరులను ఎలా రక్షించాలో, పరిసర పరిస్థితులను ఎలా గమనించాలో ఈ శిక్షణ నేర్పుతుందని తెలిపారు. పరిసరాలపై అవగాహన ఉన్నప్పుడే ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడగలమని చెప్పారు.

హైడ్రా కృషిని ప్రశంసించిన విద్యార్థులు

ఈ వారంపాటు శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను మరింత మందికి చేరవేయాలని యువకులను కోరారు. ఈ సందర్భంగా హైడ్రా కార్యకలాపాలపై విద్యార్థులు అడిగిన సందేహాలను అదనపు డైరెక్టర్ వర్ల పాపయ్య నివృత్తి చేయడంతో పాటు వారి అభిప్రాయాలను కూడా సేకరించారు. చెరువుల పునరుద్ధరణ, ప్రజా అవసరాల స్థలాలు, పార్కుల పరిరక్షణలో హైడ్రా చేస్తున్న కృషిని విద్యార్థులు ప్రశంసించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ ఇన్‌స్పెక్ట‌ర్ గౌర‌వ్‌, మై భారత్ అసిస్టెంట్ డైరెక్టర్ గంట రాజేష్, హైడ్రా ఆర్ఎఫ్‌ఓ జయప్రకాశ్, డీపీవోలు యజ్ఞ నారాయణ, గౌతమ్, ఏడీఎఫ్‌వో మోహ‌న‌రావు, ఇన్‌స్పెక్ట‌ర్ షంషుద్దీన్‌, ఎన్‌డీఎంఏ క‌న్స‌ల్టెంట్ డా.గౌత‌మ్ త‌దిత‌రులు పాల్గొని యువ ఆపద మిత్ర వాలంటీర్లకు పలు సూచనలు చేశారు.

Next Story