రహదారి మధ్యలో రైలింగ్ ను తొలగించిన హైడ్రా

by Ajay Maddhiboyina |

మధురానగర్లో మార్గం మెరుగైంది. దారి మధ్యన వేసిన రైలింగ్ ను హైడ్రా తొలగించడంతో రోడ్డు విశాలంగా మారింది. మధురానగర్ మధ్యన ఒకప్పుడు ఓపెన్ గా వున్న వరద నీటి కాలువను బాక్సు డ్రైన్ గా మార్చారు.

రహదారి మధ్యలో రైలింగ్ ను తొలగించిన హైడ్రా
X

దిశ, తెలంగాణ బ్యూరో: మధురానగర్లో మార్గం మెరుగైంది. దారి మధ్యన వేసిన రైలింగ్ ను హైడ్రా తొలగించడంతో రోడ్డు విశాలంగా మారింది. మధురానగర్ మధ్యన ఒకప్పుడు ఓపెన్ గా వున్న వరద నీటి కాలువను బాక్సు డ్రైన్ గా మార్చారు. కాలువ మీద ఉన్న స్లాబ్ పై రైలింగ్ ఏర్పాటు చేసారు. యిప్పుడు అదే ట్రాఫిక్ కు అంతరాయంగా మారింది. రైలింగ్ మధ్యలో బైక్స్ పార్కింగ్ చేయడమే కాకుండా.. ఇరువైపులా బైకులు, కార్లు పార్కింగ్ చేయడంతో దారి పొడుగునా రాకపోకలకు ఆటంకంగా మారింది. యిల్లకు, షాప్ లకు వచ్చిన వాళ్లు పెద్ద సంఖ్యలో వాహనాలు ఇరువైపులా పార్కింగ్ చేయడంతో విశాలమైన రహదారి ఇరుకుగా మారిపోయింది. బయట కాలనీ వాళ్ళు కూడా వాహనాలు అక్కడ పార్కింగ్ చేయడం, ట్యాక్సీ వాళ్ళు వాహనాలు అక్కడ నిలపడంతో కాలనీ వాసులకు ఆ మార్గంలో వెళ్ళడం ఇబ్బందిగా మారింది. ఇక పాఠశాలల వేళ స్కూల్ బస్సులు కూడా ఆ దారిన వెళ్లలేని పరిస్థితి.

*కాలనీ వాసుల ఫిర్యాదుతో..

ఈ అవస్థలను దశాబ్దాలుగా భరించిన కాలనీ వాసులు చాలా సార్లు ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించారు. హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేసారు. వాహనాల పార్కింగ్ తో ఇరుకుగా మారిన రహదారి ఫోటోలతో సహా అధికారులకు చూపించారు. ఫిర్యాదును పరిశీలించిన హైడ్రా అధికారులు క్షేత్ర స్థాయిలో ఇబ్బందులను గమనించారు. స్లాబ్ దృఢంగా ఉన్నదని నిర్ధారించుకున్నారు. 5 అడుగుల వెడల్పుతో 900ల మీటర్ల మేర వేసిన రైలింగ్ ను తొలగించడంతో ఇరువైపులా వాహనాల పార్కింగ్ కు అవకాశం లేకుండా అయ్యింది. దీంతో రోడ్డు వెడల్పు పెరిగింది.

సంబరాలు చేసుకున్న కాలనీ వాసులు…

మధురానగర్ మధ్యలో ఉన్న బాక్సు డ్రైన్ పై రైలింగ్ ను హైడ్రా తొలగించడంతో రోడ్డు వెడల్పు పెరిగిందని కాలనీ వాసులు సంబరాలు చేసుకున్నారు. రోడ్డు మధ్యలో రైలింగ్ కి ఇరువైపులా వాహనాల పార్కింగ్ కు అవకాశం లేకపోవడంతో.. స్కూల్ బస్సులు, అంబులెన్సులు సులభంగా రాకపోకలు సాగించడానికి ట్రాఫిక్ యిబ్బంది లేకుండా అయిందని ఆనందం వ్యక్తం చేశారు. మధురానగర్లో ఉన్న పాఠశాలలకు సులభంగా వెళ్లడానికి వీలు పడిందని పలువురు పేర్కొన్నారు. హైడ్రాను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే.. క్షేత్రస్థాయిలో ఇబ్బందులను పరిశీలించి.. సమస్యను పరిష్కార చైనా హైడ్రా అధికారులకు అభినందనలు తెలిపారు.

Next Story