వీకెండ్ కూల్చివేతలు షురూ.. ఎల్లారెడ్డి గూడలో దశాబ్దాల పోరాటానికి పరిష్కారం చూపిన HYDRAA

by Ramesh Naini |

హైదరాబాద్ నగరంలో హైడ్రా వీకెండ్ కూల్చివేతలు షురూ అయింది.

వీకెండ్ కూల్చివేతలు షురూ.. ఎల్లారెడ్డి గూడలో దశాబ్దాల పోరాటానికి పరిష్కారం చూపిన HYDRAA
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో హైడ్రా (HYDRAA) వీకెండ్ కూల్చివేతలు షురూ అయింది. మధురనగర్ మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలోని (Yellareddyguda) ఎల్లారెడ్డి గూడలో పార్క్ ఆక్రమణలను (encroachments) ఆదివారం హైడ్రా తొలగించింది. సాయి సారధినగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా ఇవాళ చర్యలు తీసుకుంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు రంగంలోకి దిగి ఆక్రమణలు కూల్చివేశారు. 1961లో 5 ఎకరాల విస్తీర్ణంలో సాయి సారధినగర్ పేరిట 35 ప్లాట్లతో లేఔట్ ఏర్పాటు చేశారు. అందులో 1533 గజాల స్థలాన్ని పార్కుగా చూపించినట్టు నిర్ధారణ అయింది. లేఔట్‌లో నారాయణ ప్రసాద్ వారసులు పార్కు స్థలంలో షెడ్డు వేసి ఖాళీ చేయకుండా ఆక్రమ నిర్మాణం చేశారు.

వ్యవస్థలను మేనేజ్ చేసి.. ఇంటి నెంబర్ కూడా తెచ్చుకున్నట్టు స్థానికులు వెల్లడించారు. పలుమార్లు జీహెచ్ఎంసీకి కూడా ఫిర్యాదు చేసినా.. ఈ లేఔట్లో 6 రోడ్లను అభివృద్ధి చేసి పార్కును మాత్రం ఖాళీ చేయించలేదని తెలిపారు. దీంతో సాయి సారధి నగర్ నివాసితులు హైడ్రాను ఆశ్రయించారు. క్షేత్ర స్థాయిలో వివిధ శాఖలతో కలిసి హైడ్రా పూర్తి స్థాయి విచారణ చేసి.. ఆక్రమణలను హైడ్రా తొలగించింది. పార్కు స్థలంగా గుర్తించి ప్రొటెక్టెడ్ బై హైడ్రా అధికారులు బోర్డు పెట్టారు. దీంతో దశాబ్దాల పోరాటం హైడ్రాతో పరిష్కారం అయ్యిందంటూ స్థానికుల హర్షం వ్యక్తం చేశారు. 60 ఏళ్ల పోరాట ఫలితమంటూ హైడ్రా అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story