- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hydra: హైడ్రాలో ప్రజావాణి.. రాత్రి వరకూ 78 ఫిర్యాదులను విచారించిన రంగనాథ్
‘సంబంధిత ఫిర్యాదు ఆధారంగా అధికారులు మీ వద్దకే వచ్చి విచారిస్తారు. ఫిర్యాదులకు సంబంధించిన పత్రాలను మాత్రం తప్పనిసరిగా చూపించాలి’ అని ఫిర్యాదులకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ భరోసా కల్పించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘సంబంధిత ఫిర్యాదు ఆధారంగా అధికారులు మీ వద్దకే వచ్చి విచారిస్తారు. ఫిర్యాదులకు సంబంధించిన పత్రాలను మాత్రం తప్పనిసరిగా చూపించాలి’ అని ఫిర్యాదులకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ భరోసా కల్పించారు. హైడ్రా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. సోమవారం మొత్తం 78 ఫిర్యాదులు వచ్చాయి. సోమవారం నిర్వహించిన మూడో ప్రజావాణికి.. ఔటర్ రింగురోడ్డు పరిధివరకూ నలువైపుల నుంచి ఫిర్యాదు దారులు వచ్చి హైడ్రా కమిషనర్‌ను కలిసి వినతి పత్రాలు అందజేశారు. అక్కడికక్కడే వారి ఫిర్యాదులను విచారించి.. సంబంధిత అధికారులకు ఆయా ఫిర్యాదులను కేటాయించి లోతైన విచారణ చేపట్టాలని కమిషనర్ సూచించారు. స్థానిక అధికారుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకుని.. ఫిర్యాదు దారుల సమక్షంలోనే విచారణ జరిపించాలని అధికారులకు ఆదేశించారు. రెండు వారాల్లో మీ వద్దకే అధికారులు వచ్చి విచారణ చేపడతారని.. అధికారుల ఫోను నంబర్లను కూడా ఫిర్యాదుదారులకు అందజేశారు. 4 వారాలకు సమస్య పరిష్కారం కాకుంటే తర్వాత నేరుగా తానే వచ్చి విచారిస్తానని చెప్పారు. ముందుగా విచారణ జరిపించి.. కబ్జాదారులమీద మీద కేసులు పెట్టాలని సూచించారు. కబ్జాల చెర నుంచి కాపాడిన ప్రభుత్వ భూములు, పార్కుల చుట్టూ ఫెన్సింగ్ వేసి వాటిలో ప్రొటెక్టడ్ బై హైడ్రా అని బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. జులై 2024 తర్వాత అనుమతి లేని నిర్మాణాలు జరుగుతుంటే వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలు పెరుగుతున్నాయనే ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వెంటనే ఈ విషయమై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. సర్వే ఆఫ్ ఇండియా, ఎన్ ఆర్ ఎస్ సీ శాటిలైట్ ఇమేజీలతో పాటు గ్రామాలకు చెందిన మ్యాప్‌లను పరిశీలించి.. వాటి ఎఫ్‌టీఎల్ పరిధిని నిర్ధారించాలని సూచించారు. అమీన్‌పూర్ చెరువు, దుర్గం చెరువు, మన్సూరాబాద్ పెద్ద చెరువు, మాసబ్ చెరువు(తుర్కయాంజల్)లను ముందుగా పరిశీలించాలన్నారు.
ఫిర్యాదులు ఇలా..
- సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ గ్రామం సర్వే నంబరు 119 నుంచి 220 వరకూ ఉన్న 408 ఎకరాల్లో అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయని పలువురు ఫిర్యాదు చేశారు. గతంలో 3800 మంది అక్కడ గ్రామపంచాయతీ లే ఔట్‌లో ఇంటి స్థలాలు కొని రిజిస్టర్ చేసుకుంటే.. ఆ భూమి ప్రభుత్వానిది అని తేల్చితే.. తామంతా కోర్టును ఆశ్రయించామని హైడ్రా కమిషనర్‌కు వివరించారు. హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ అక్కడ వారు అన్ని వ్యవస్థలను మేనేజ్‌చేసి ఇంటి స్థలాలుగా అమ్మేస్తున్నారని పేర్కొన్నారు. ఇలా 700ల పైచిలుకు ఇళ్లు నిర్మాణం జరిగాయని.. ప్రభుత్వ శాఖలు కూడా కరెంటు,తాగు నీరు, రహదారుల సౌకర్యం కల్పిస్తున్నాయని ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. హైడ్రా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని గతంలో అక్కడ ఇంటి స్థలాలు కొన్నవారు అభ్యర్థించారు.
- రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం కుంట్లూర్ (పెద్ద చెరువు) చెరువులో 2 ఎకరాల స్థలాన్ని కబ్జాచేశారని.. 59 జీవో ప్రకారం రెగ్యులరైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని.. వెంటనే ఆ భూమిని కాపాడాలంటూ ఫిర్యాదు అందింది.
- నిజాంపేట మున్సిపాలిటీ లోని మొదటి డివిజన్‌లో 2900 గజాల పార్కును స్థానికులు కబ్జా చేస్తున్నారని కేవీఆర్ రెయిన్‌బో కాలనీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఈ పార్కులో వ్యాయామానికి సంబంధించిన పరికరాలు అమర్చితే వాటిని తొలగించి కబ్జా చేయబోగా తాము అడ్డుకున్నామని.. అక్కడ హైడ్రా బోర్డు పెడితే పార్కును కాపాడినవారౌతారని ఫిర్యాదు చేశారు.
- రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం చింతలకుంట ప్రాంతంలోని మన్సూరాబాద్ పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిని పెంచేసి తమ ఇంటి స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంలేదని వాసవి గ్రాడ్యుయేట్స్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. గతంలో ఉన్న గ్రామపంచాయతీ లే ఔట్‌ను 1993లో హుడా ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు.






