గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు.. భారీగా మోహరించిన పోలీసులు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-06 05:44:55  IST  )

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో హైడ్రా భారీగా కూల్చివేతలు (Hydra Demolitions) చేపట్టింది. మంగళవారం ఉదయమే సంధ్య కన్వెన్షన్ సెంటర్ (Sandhya Convention Centre) మినీ హాల్ ను కూల్చివేస్తోంది.

గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు.. భారీగా మోహరించిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్/ శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండలంలో హైడ్రా మరోసారి కూల్చివేతలు (Hydra Demolitions) చేపట్టింది. గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌కు ఎదురుగా గల సంధ్యా కన్వెన్షన్ (Sandhya Convention Centre) మినీ హాల్, ఫుడ్‌కోర్ట్‌ల కూల్చివేతలు కొనసాగిస్తుంది. గచ్చిబౌలి సర్వే నెంబర్ 124, 127లలోని సుమారు 20 ఎకరాలలో గతంలో ఫర్టిలైజర్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లేఅవుట్ వేసింది. ఈ లే అవుట్‌లో 162 మంది ప్లాట్స్ కొనుగోలు చేశారు. అందులోనే సంధ్యా కన్వెషన్ వారు సొసైటీ లేఅవుట్‌లో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కోఆపరేటివ్ సొసైటీలో ప్లాట్లు కొనుగోలు చేసినవారు ఇటీవల హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు.

గతంలో వేసిన లేఅవుట్ నామరూపాలు లేకుండా రోడ్స్, పార్క్స్‌ ను కలుపుతూ సంధ్యా కన్‌స్ట్రక్షన్ పలు ఆక్రమణలు చేపట్టిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హైడ్రా మంగళవారం ఉదయం నుండి అనుమతులు లేని కట్టడాలను తొలగింపు పనులను చేపట్టింది. సంధ్య కన్వెన్షన్ మినీ హాల్ తో పాటు వంటగదులు, రెస్ట్ రూమ్ లను తొలగించారు. లేఅవుట్ ను ఆక్రమించి నిర్మించిన రేకుల ఫెన్సింగ్, జీ ప్లస్ 2గా నిర్మించిన 3 ఐరన్ షడ్ లను సైతం తొలగించారు. ఇంకా పలు నిర్మాణాలను కూల్చివేయనున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు.

కాగా.. నగరంలో ఇకపై కబ్జాలకు పాల్పడే వారిని కటకటాల్లోకి పంపేందుకు హైడ్రా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను (Hydra Police Station) ఏర్పాటు చేసింది. బుద్ధభవన్ సమీపంలో ఉన్న భవనంలో రెండంతస్తుల్లో హైడ్రా పోలీస్ స్టేషన్ ను నిర్మిస్తున్నారు. ఈనెల 8న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. ఇందులో ఒక ఏసీపీ, ఆరుగురు ఇన్ స్పెక్టర్లు, 12 మంది ఎస్సైలు, 30 మంది కానిస్టేబుళ్లతో పాటు 70కి పైగా వాహనాలు అందుబాటులో ఉండనున్నాయి. భూ కబ్జాలతో పాటు.. అక్రమ ఇసుక దందా పై కూడా హైడ్రా ఫోకస్ చేయనుంది.

Next Story