Hydra: కొనసాగుతున్న కూల్చివేతలు.. కూకట్‌పల్లిలో మధ్యతరగతి ప్రజలకు న్యాయం చేసిన హైడ్రా

by Ramesh Naini |

తెలంగాణ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

Hydra: కొనసాగుతున్న కూల్చివేతలు.. కూకట్‌పల్లిలో మధ్యతరగతి ప్రజలకు న్యాయం చేసిన హైడ్రా
X

దిశ, తెలంగాణ బ్యూరో / డైనమిక్ బ్యూరో: తెలంగాణ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో హైడ్రా (Hydra) అక్రమణలను తొలగిస్తోంది. ముందుగా కూకట్‌పల్లి (Kukatpally) పరిధి హైదర్‌నగర్‌లోని డైమండ్ ఎస్టేట్ లేఅవుట్‌ను ఆక్రమణదారుల చెర నుంచి హైడ్రా విడిపించింది. సర్వే నంబర్ 145లో అన్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్‌తో 9 ఎకరాల లేఅవుట్‌ను కబ్జా చేసి.. అంతకు ముందు అందులో ఉన్న ప్లాట్ హద్దులను చెరిపేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 79 ప్లాట్లు, లేఔట్ ప్రకారం పార్కులు, రహదారులు కబ్జాకు గురి అయ్యాయని ప్లాట్ యజమానులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 2000 సంవత్సరంలోనే ప్లాట్లను 79 మంది మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేశారు. ఆ స్థలం తమదేనంటూ శివ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఆక్రమించడంతో హైకోర్టును బాధితులు ఆశ్రయించారు. 2024లో కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా ప్రయోజనం లేకపోయిందని బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు దశాబ్దాలుగా కోర్టులో కేసు పెండింగ్ ఉంటుండగా అక్కడ స్థలాన్ని అద్దెలకు ఇచ్చి నెలకు రూ.50 లక్షలకు పైగా అద్దె తీసుకుంటున్నాడంటూ ప్లాట్ యాజమానులు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదులను సంబంధిత అధికారులతో క్షేత్ర స్థాయిలో గత బుధవారం పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ. రంగనాథ్.. (Hydra Commissioner A.V Ranganath) హెచ్ఎండీఏ లేఔట్ తో పాటు పార్కులు, రహదారులు కబ్జాకు గురైనట్టు నిర్ధారించారు. ఈ క్రమంలోనే ఆక్రమణల తొలగింపునకు కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. సోమవారం ఉదయం పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలను బుల్డోజింగ్ చేశారు. ఇదిలా ఉండగా తాజాగా మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడ(Puppalaguda)లోని డాలర్ హిల్స్‌లో హైడ్రా అధికారులు ఆక్రమణలను తొలగించారు. లేఅవుట్లో కొంత భాగంతో పాటు రోడ్డు, పార్కును కబ్జా చేసి నిర్మాణాలు చేశారని ఆరోపణలు వచ్చాయి. డాలర్ హిల్స్ ప్లాట్ యజమానులు ఇచ్చిన ఫిర్యాదును క్షేత్ర స్థాయిలో బుధవారం హైడ్రా కమిషనర్ పరిశీలించారు. పాత లేఔట్‌ను రద్దు చేసి వ్యవసాయ భూమిగా మార్చి ఎన్‌సీసీ సంస్థకు ఇచ్చారు. ఇరుపక్షాలను పిలిచి విచారించిన తర్వాత పార్కు స్థలం, రహదారులు కబ్జాకు గురి అయినట్టు నిర్ధారణ అయింది. ఎలాంటి అనుమతులు లేకుండా అక్కడ నిర్మాణాలు చేస్తున్నట్టు తేలడంతో పనులు ఆపించి హైడ్రా ఆక్రమణలను తొలగించింది.

Next Story