- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీటి యుద్ధాలు రాకముందే మేల్కొందాం.. వాటర్ డే వేడుకల్లో హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు
‘ప్రస్తుతం ఆయిల్ కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. జలవనరులపై యుద్ధాల వరకూ వెళ్లకుండా జాగ్రత్త పడాలి. నీటి యుద్ధాలకు ఆస్కారం లేకుండా మేలుకొందాం’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ప్రస్తుతం ఆయిల్ కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. జలవనరులపై యుద్ధాల వరకూ వెళ్లకుండా జాగ్రత్త పడాలి. నీటి యుద్ధాలకు ఆస్కారం లేకుండా మేలుకొందాం’ అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. జేఎన్‌టీయూలో ఓపెన్ జియోస్పేషియల్ కన్సార్టియంతో కలసి ఇండియన్ సొసైటీ ఆఫ్ జియోమేటిక్స్ - హైదరాబాద్ చాప్టర్ సోమవారం నిర్వహించిన వరల్డ్ వాటర్ డే ఉత్సవాలలో హైడ్రా కమిషనర్ మాట్లాడారు. నగర జనాభా అనూహ్యంగా పెరుగుతోందని, 1.60 కోట్లున్న నగర జనాభా 2050 నాటికి 3 కోట్లకు దాటే అవకాశం ఉందన్నారు. ఇలా పెరుగుతున్న జనాభా అవసరాలమేరకు నగరాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో నగరంలోని గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయించిందని.. ఆ దిశగా హైడ్రా వడివడిగా అడుగులేస్తోందని చెప్పారు. మొదటి దశ 6 చెరువులో మూడు ప్రారంభమవ్వగా.. మిగతా 3 చెరువులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. రెండోదశలో మరో 18 చెరువులను రెండో దశగా చేపట్టామని హైడ్రా కమిషనర్ చెప్పారు. కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో వర్షాకాలం వరదలు.. వేసవి కాలం నీటి ఎద్దడి సర్వ సాధారణంగా మారింది. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణతో వరదలకు చెక్ పెట్టడమే కాకుండా.. నగరంలో భూగర్భ జలాలు పెరగడానికి అవకాశం ఉంటుందన్నారు.
కబ్జాలకు చెక్ పెడుతున్న హైడ్రా..
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్సీ) డేటా ప్రకారం 1975 నుంచి 2023 లోపు నగరంలో 61 శాతం చెరువులు మాయమయ్యాయని.. మరో 15 ఏళ్లలో ఉన్నవి కూడా కనుమరుగయ్యే పరిస్థతి ఉందని హెచ్చరించిన విషయాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 1300ల చెరువుల్లో 700ల చెరువులు మాయం అవ్వగా.. ఉన్న చెరువులు 60 శాతం కబ్జాకు గరయ్యాయని అన్నారు. ఆక్రమణలను తొలగించాలని పేపర్లలో ఉంటుందని, లిఖితపూర్వక ఆదేశాలుంటాయని, కాని అవి అమలు కాని పరిస్థితి గతంలో ఉండేదన్నారు. మాదాపూర్‌లోని తమ్మిడికుంట చెరువు ఫుల్ ట్యాంక్ పరిధిలోని ఎన్ కన్వెన్షనే ఇందుకు ఉదాహరణగా గుర్తుచేశారు. హైడ్రా వెంటనే ఆ పని చేసి 14 ఎకరాలకు కుంచించుకుపోయిన తమ్మిడికుంటను 29 ఎకరాలకు విస్తరించిందని తెలిపారు. ఆక్రమణలను తొలగించినప్పడు విమర్శించినవారే నేడు అభినందిస్తున్నారని తెలిపారు.
కాముని చెరువును పునరుద్ధరించండి
మూసాపేటలోని కాముని చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ సోమవారం సందర్శించారు. రెండో విడత చేపడుతున్న 14 చెరువుల్లో కాముని చెరువు కూడా ఉందనే విషయం విధితమే. ఈ చెరువు పునరుద్ధరణను వెంటనే చేపట్టాలని అక్కడి స్థానికులు కమిషనర్‌ను కలిసి విన్నవించారు. కూకట్‌పల్లి నల్ల చెరువులా దీనిని కూడా అభివృద్ధి చేస్తే.. దోమల ఇబ్బందులు తగ్గుతాయని.. దుర్గంధం దూరమౌతుందని పలువురు పేర్కొన్నారు. దోమల వల్ల ప్రస్తుతతం నివాసాల తలుపులు తీయలేకపోతున్నామని.. వాపోయారు. అయితే ఈ చెరువు పునరుద్ధరణకు సంబంధించి హెచ్ఎండీఏ నుంచి సాంకేతిక అనుమతులు రావాల్సి ఉందని.. అవి రాగానే పనులను స్పీడప్ చేస్తామని ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్‌కు అక్కడ పనులు పర్యవేక్షిస్తున్న అధికారులు వివరించారు.






