ఆక్రమణలను ఉపేక్షించేది లేదు: హైడ్రా కమిషనర్ రంగనాథ్

by Bhanu |

భూ ఆక్రమణదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు.

ఆక్రమణలను ఉపేక్షించేది లేదు: హైడ్రా కమిషనర్ రంగనాథ్
X

దిశ, శేరిలింగంపల్లి : భూ ఆక్రమణదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ప్రజావాణిలో భాగంగా హైడ్రా కార్యాలయంలో రంగనాథ్ సొసైటీ ప్లాట్ ఓనర్స్ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో బుధవారం శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లిలో రంగనాథ్ సోసైటి లేఅవుట్ లో అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితిని బాధితులను అడిగి తెలుసుకున్నారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోపనపల్లి సర్వే నంబర్ 163 నుంచి 286 వరకు మొత్తం 120 ఎకరాల 25 గుంటల విస్తరించి ఉన్న రంగనాథ్ సోసైటి లే అవుట్ లో 200, 300, 500 గజాల విస్తీర్ణంలో మొత్తం 1400 ప్లాట్లను విక్రయించారు. అయితే ఇందులో కొన్ని ప్లాట్లను కొనుగోలు చేసిన ఓ మాజీమంత్రి అల్లుడు, మిగతా ప్లాట్లను కూడా కలిపి కంచె వేశారని, అతనిపై గతంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ప్లాట్ ఓనర్స్ తెలిపారు. ఎన్నిసార్లు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో హైడ్రాకు ఫిర్యాదు చేసినట్లు రంగనాథ్ సొసైటీ ప్లాట్ ఓనర్స్ తెలిపారు. కరోనా సమయంలో బడా రియల్ ఎస్టేట్ సంస్థల యజమానులు సమూహంగా ఏర్పడి మా లేఔట్ మొత్తాన్ని కబ్జా చేశారని బాధితులు కమిషనర్ ముందు వాపోయారు. అప్పటికే కొంతమంది ఇళ్లను కట్టుకుని ఉండగా మమ్మల్ని తరిమేసి ఇండ్లను నేలమట్టం చేసి రహదారులు, పార్కులు కలిపేసి వ్యవసాయ భూమిగా మార్చేశారని ఆరోపించారు.

చివరికి అందులో ఉన్న దేవుడి గుడిని కూడా వదల్లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకువచ్చారు. తాము కోర్టులను ఆశ్రయించామని.. వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్లిందని బాధితులు తెలిపారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు హై కోర్టు తమకు 4 వారాల్లో న్యాయం చేయాలని తీర్పు యిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా బాధితులు గుర్తు చేశారు. ఈ తీర్పు ప్రకారం ఆక్రమణలను తొలగించాలని జీహెసీఎంసీ డిప్యూటీ కమిషనర్, నోడల్ అధికారికి ఆదేశాలిచ్చినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ప్లాట్ ఉందనీ తాము ఆ స్థలం దరిదాపులకు వచ్చినా బౌన్సర్లను పెట్టి మా మీద దాడులు చేశారంటూ బాధితులు కన్నీరుమున్నీరు అయ్యారు. నిత్యం వందలాది మంది బౌన్సర్లను అక్కడ కాపలా పెట్టి అటు వైపు చూడడానికి కూడా వీలు లేకుండా చేస్తున్నారని హైడ్రా కమిషనర్ కు తెలిపారు. ఫిర్యాదు దారులు చెప్పినది విన్న కమిషనర్ రంగనాథ్.. వారం 10 రోజుల్లో ఇరుపక్షాలను పిలిపించి మాట్లాడుతానని.. ఆందోళన చెందవద్దని ప్లాట్ యజమానులకు భరోసా ఇచ్చారు. అన్ని కోణాల్లోనూ పరిశీలించి న్యాయం చేస్తామన్నారు.

కొన్న ప్లాట్లకు మాత్రమే కాకుండా మిగతా వాటికి కూడా ఫెన్సింగ్ వేసిన వారి దగ్గర నుండి డాక్యుమెంట్స్ తెప్పించి చెక్ చేస్తామని, డాక్యుమెంట్స్ ఎవరివి కరెక్ట్ గా ఉంటే వారికి న్యాయం చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ బాధితులకు హామీ ఇచ్చారు. ఎవరు ఆక్రమణలకు పాల్పడ్డా ఉపేక్షించబోమని రంగనాథ్ హెచ్చరించారు. అంతకు ముందు మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల, బోడుప్పల్ ప్రాంతాల్లో కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యటించారు. దేవాదాయ శాఖ ట్రస్ట్ భూములను ఆక్రమించి ఆ పక్కనే ఉన్న మా లేఔట్ ను కబ్జా చేయడానికి మాజీ ఎమ్మెల్యే ప్రయతిస్తున్నారని శ్రీ మాత అరవింద కాలనీ వాళ్ళు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్ 33/10లో మొత్తం 13 ఎకరాలు ఉండగా అందులో 7 ఎకరాలలో మాత అరవింద్ కాలనీ లేఔట్ దశాబ్దాల క్రితం 444 ప్లాట్లతో ఏర్పడిందన్నారు. మా లేఔట్ పక్కనే మాజీ ఎమ్మెల్యేకు చెందిన స్థలం ఉండగా మా లేఔట్ దేవాదాయ శాఖ భూములంటూ కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. రిజిస్ట్రేషన్లను అడ్డుకుంటున్నాడని వాపోయారు. అదే ప్రాంతంలో బోడుప్పల్ విలేజ్ లో లేఔట్లో వికాస్ వెల్ఫేర్ కాలనీలో 70 ప్లాట్లు ఉండగా అందులో 35 ప్లాట్లు కలిగిన రాజకీయ నాకుడు, గత ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి తమ ప్లాట్లు కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆ లేఔట్ లో రోడ్లు, పార్కులు లేకుండా చేశారంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు. అలాగే శ్మశాన వాటికలున్న స్థలం తనదంటూ ప్లాట్లు వేసి విక్రయాలు చేపట్టారన్న ఫిర్యాదును కమిషనర్ పరిశీలించారు. గోపన్నపల్లిలో హౌసింగ్ బోర్డుకు కేటాయించిన దాదాపు 60 ఎకరాల భూమి లో ఫెన్సింగ్ వేయనియ్యడం లేదని స్థానిక అధికారులు ఫిర్యాదు చేయగా కమిషనర్ పరిశీలించారు. షేక్ పేట్ లోని ఓయూ కాలనీలో రోడ్ల అక్రమాలపై ఫిర్యాదు రావడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ప్లాట్ ఓనర్లతో చర్చించి సంబంధిత పత్రాలను అందజేయాలని ఆదేశించారు.

Next Story