Hydra: శిథిలావ‌స్థ‌కు చేరిన నిర్మాణాలు తొలగించాలి: హైడ్రా కమిషనర్ ఆదేశాలు

by Ramesh Naini |

ఫ‌తేన‌గ‌ర్ వంతెన మెట్ల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ మంగ‌ళ‌వారం ఉద‌యం ప‌రిశీలించారు.

Hydra: శిథిలావ‌స్థ‌కు చేరిన నిర్మాణాలు తొలగించాలి: హైడ్రా కమిషనర్ ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Fatehnagar) ఫ‌తేన‌గ‌ర్ వంతెన మెట్ల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ (Hydra Commissioner Ranganath) మంగ‌ళ‌వారం ఉద‌యం ప‌రిశీలించారు. శిథిలావ‌స్థ‌కు చేరుకున్న వంతెన మెట్లపై నుంచి దిగుతుండ‌గా అవి విరిగిప‌డి పలువురికి తీవ్ర గాయాలైన విష‌యం తెలిసిందే. సోమ‌వారం జ‌రిగిన ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో క‌మిష‌న‌ర్ మెట్ల మార్గాన్ని మంగ‌ళ‌వారం ప‌రిశీలించారు. ప్ర‌తి ఆదివారం స‌న‌త్‌న‌గ‌ర్‌లో సంత జ‌రుగుతుంద‌ని.. ఆ స‌మ‌యంలో వంద‌లాది మంది మెట్ల మార్గాన్ని వినియోగిస్తార‌ని ప‌లువురు క‌మిష‌న‌ర్ దృష్టికి తీసుకువ‌చ్చారు. శిథిలావ‌స్థ‌కు చేరుకున్న మెట్ల‌పై నుంచి రాక‌పోక‌లు సాగించ‌డం స‌రికాద‌ని క‌మిష‌న‌ర్ నిర్ధారించారు. వంతెన‌కు ఆనుకుని ఏర్పాటు చేసిన మెట్ల‌ను పూర్తిగా తొల‌గించాల‌ని హైడ్రా అధికారుల‌ను ఆదేశించారు.

అలాగే న‌గ‌రంలో శిథిలావ‌స్థ‌కు చేరిన నిర్మాణాల విష‌యంలో సివిల్ ఇంజినీరింగ్ విభాగం నిపుణుల‌తో త‌నిఖీ చేయించి ప్ర‌మాద‌క‌రంగా మార‌క ముందే వాటిని తొల‌గించాల‌ని క‌మిష‌న‌ర్ అధికారుల‌కు సూచించారు. క‌మిష‌న‌ర్ ఆదేశాల‌తో ఫ‌తేన‌గ‌ర్ వంతెన‌కు ఆనుకుని నిర్మించిన మెట్ల మార్గాన్ని జేసీబీతో హైడ్రా డిజాస్ట‌ర్ సిబ్బంది మెట్ల‌ను తొల‌గించారు. కొత్త‌గా అక్క‌డ మెట్లు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తామ‌ని ఫ‌తేన‌గ‌ర్ కార్పొరేట‌ర్ స‌తీష్‌గౌడ్ ఈ సంద‌ర్భంగా చెప్పారు.

Next Story