ఆప‌న్న‌హ‌స్తం శిక్ష‌ణ‌ను ప్రారంభించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌

by Muthe.Rajitha |

‘నేను.. నా వాళ్ల‌తో పాటు.. చుట్టు ప‌క్క‌ల ఉన్న వాళ్ల గురించి ఆలోచించిన‌ప్పుడే మ‌న జీవితానికి సార్ధ‌క‌త ఉంటుంది’ అని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ.రంగ‌నాథ్ అన్నారు.

ఆప‌న్న‌హ‌స్తం శిక్ష‌ణ‌ను ప్రారంభించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో : ‘నేను.. నా వాళ్ల‌తో పాటు.. చుట్టు ప‌క్క‌ల ఉన్న వాళ్ల గురించి ఆలోచించిన‌ప్పుడే మ‌న జీవితానికి సార్ధ‌క‌త ఉంటుంది’ అని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ.రంగ‌నాథ్ అన్నారు. ‘పరుల కోసం పాటుపడని నరుడి బతుకు దేనికని’ ప్రముఖ కవి సి.నా.రె. తన గజల్స్‌లో చెప్పిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ఇది మానవ జీవితం పరమార్థాన్ని, ఇతరుల కోసం జీవించడం ప్రాముఖ్యతను తెలియజేసే గొప్ప వాక్యమ‌ని దీనిని అంద‌రూ ఒంట ప‌ట్టించుకోవాల‌ని సూచించారు.

ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించిన‌ప్పుడు త‌న‌తో పాటు చుట్టుప‌క్క‌ల వారిని కూడా సుర‌క్షితంగా కాపాడాల‌నే ఉద్దేశంతో ‘యువ ఆప‌ద మిత్ర’ పథకం వాలంటీర్లకు హైడ్రా ఆధ్వ‌ర్యంలో ఫ‌తుల్‌గూడలో వారం రోజుల పాటు ఏర్పాటు చేసిన శిక్ష‌ణ‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ప్రారంభించి ప్ర‌సంగించారు. ప‌రుల కోసం పాటుప‌డే ఆలోచ‌న‌తో ఈ శిక్ష‌ణ‌కు రావ‌డం ఎంతో ఆనందించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు. రెండు చేతుల్లో ఒక‌టి ప‌రుల‌కు చేయూత‌నందించ‌డానికి ఉప‌యోగ‌ప‌డాల‌న్నారు. మ‌నం జీవితంలో ఉన్న‌త స్థితికి చేరుకోవ‌డం వ‌ర‌కే ప‌రిమితమ‌వ్వ‌కుండా ఇత‌రుల‌కు కూడా చేయూత‌నందించాల‌న్నారు.

ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించిన‌ప్పుడు తోటివారిని కాపాడ‌డం ఎలా అనేది ఈ శిక్ష‌ణ‌లో నేర్పుతార‌ని.. మీకు కూడా మీ చుట్టుప‌క్క‌ల ఉన్న ప‌రిస్థితుల‌పై అవ‌గాహ‌న ఉండాల‌న్నారు. అప్పుడే ప్ర‌మాద స‌మ‌యంలో తోటివారిని కాపాడ‌గ‌ల‌ర‌న్నారు. వారం రోజుల శిక్ష‌ణ‌లో.. అన్ని మెలుకువ‌లు నేర్చుకుని.. వాటిని మ‌రింత‌మందికి మీరు తెలియ‌జేయాల‌ని సూచంచారు. ఈ సంద‌ర్భంగా హైడ్రా కార్య‌క‌లాపాల గురించి విద్యార్థ‌ుల సందేహాల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ.రంగ‌నాథ్ నివృత్తి చేయ‌డ‌మే కాకుండా.. వారి నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తెలుసుకున్నారు.

చెరువుల‌ను పున‌రుద్ధ‌రించ‌డం, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను, పార్కుల‌ను ప‌రిర‌క్షించ‌డంలో హైడ్రా కృషిని విద్యార్థులు అభినందించారు. హైడ్రా అడ్మిన్ ఎస్‌పీ ఆర్‌.సుద‌ర్శ‌న్, హైడ్రా అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ వ‌ర్ల పాప‌య్య, ఎన్‌డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ దామోద‌ర్ సింగ్‌, మై భార‌త్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గంటా రాజేష్, హైడ్రా ఆర్ఎఫ్‌వో జ‌య‌ప్ర‌కాశ్, డీఎప్‌వోలు య‌జ్ఞ నారాయ‌ణ, గౌత‌మ్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని యువ ఆప‌ద మిత్ర వాలంటీర్ల‌నుద్దేశించి ప‌లు సూచ‌న‌లు చేశారు. వారం రోజుల శిక్ష‌ణ గురించి హైడ్రా ఏడీఆర్ ఎఫ్‌వో డి. మోహ‌న‌రావు వివ‌రించారు. హైడ్రా క‌మిష‌న‌ర్ సూచ‌న‌ల మేర‌కు క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌ల‌ను కూడా భాగం చేసిన‌ట్టు చెప్పారు.

Next Story