- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బతుకమ్మ కుంటలో ఎగిరిన పతంగి
అంబర్ పేటలోని బతుకమ్మకుంటలో ఎగిరిన పతంగులు ఇంద్రధనుస్సు తలపించాయి. ఒకదానితో ఒకటి పోటీ పడి నింగివైపు దూసుకెళ్లిన పతంగులను చూసి పిల్లలు కేరింతలు కొట్టారు.

దిశ, తెలంగాణ బ్యూరో: అంబర్ పేటలోని బతుకమ్మకుంటలో ఎగిరిన పతంగులు ఇంద్రధనుస్సు తలపించాయి. ఒకదానితో ఒకటి పోటీ పడి నింగివైపు దూసుకెళ్లిన పతంగులను చూసి పిల్లలు కేరింతలు కొట్టారు. బతుకమ్మకుంట చెంత స్థానికులు ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్లో హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ పాల్గొన్నారు. పార్లమెంట్ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంత రావుతో కలసి హైడ్రా కమిషనర్ గాలిపటాలు ఎగురవేశారు. దీంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. ఆక్రమణలు తొలగించి హైడ్రా రూపొందించిన బతుకమ్మ కుంటతో ఇక్కడ వాతావరణం మారిపోయిందని చెబుతూ స్థానికులు మిఠాయిలు తినిపించుకున్నారు. మహిళలతో పాటు స్థానికులు హైడ్రా కమిషనర్ ను కలసి బతుకమ్మ చెరువును పునరుద్ధరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఉదయం, సాయంత్రం చెరువు చుట్టూ వాకింగ్ చేస్తున్నామని తెలిపారు. మా ఆరోగ్యాలు మెరుగవుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. బతుకమ్మ కుంటాను అభివృద్ధి చేసిన ప్రభుత్వానికి, హైద్రాకు కృతజ్ఞతలు తెలిపారు.
సౌకర్యాలు పెంచుతాం..
చెరువు చెంత మహిళలు, చిన్నారులు వినియోగించేలా వ్యాయామ పరికరాలను సమకూర్చుతామని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ తెలిపారు. వృద్ధులు సేదదీరేలా మరిన్ని కుర్చీలు ఏర్పాటు చేస్తామన్నారు. మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు. ఇక్కడ సెక్యూరిటీ సిబ్బందికి కూడా విశ్రాంతి గదులు నిర్మిస్తామన్నారు. హైడ్రా అభివృద్ధి చేసిన చెరువు చెంత స్థానికులు పెద్దఎత్తున సేదదీరడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందని అన్నారు. నగరవ్యాప్తంగా మరిన్ని చెరువుల అభివృద్ధి చేయాలని ప్రభుత్వం తలచిందన్నారు. మొదటవిడత హైడ్రా చేపట్టిన 6 చెరువులలో ఇప్పటికీ బతుకమ్మ కుంట ప్రారంభం అవ్వగా మిగతా 5 చెరువులు ఒకటి రెండు నెలల్లో అందుబాటులోకి వస్తాయన్నారు. మరో 14 చెరువులు ఈ ఏడాది కొత్తగా చేపడుతున్నామన్నారు. హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల చెంత పండగ వాతావరణం నెలకొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ ఎంతో సాహసోపేతంగా చేస్తోందన్నారు. ఆక్రమణలు తొలగించి చెరువులను అభివృద్ధి చేయడం సాధారణ విషయం కాదన్నారు. తెలంగాణ ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ గారు, హైడ్రా అధికారులు తిరుమల్, ఉమామహేశ్వర రావు ఇన్స్పెక్టర్ బాలగోపాల్, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






