4 అంతస్తులకు అనుమతి.. 6 అంతస్తుల్లో నిర్మాణం.. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి హైడ్రా చీఫ్

by Gantepaka Srikanth |

ఒక భ‌వ‌నం నిర్మాణంలో ఇన్ని ఉల్లంఘ‌న‌లా..? ఆసుప‌త్రి అంటే మ‌రిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి.. ఎక్కడిక‌క్కడ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే ఎలా అంటూ హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

4 అంతస్తులకు అనుమతి.. 6 అంతస్తుల్లో నిర్మాణం.. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి హైడ్రా చీఫ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఒక భ‌వ‌నం నిర్మాణంలో ఇన్ని ఉల్లంఘ‌న‌లా..? ఆసుప‌త్రి అంటే మ‌రిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి.. ఎక్కడిక‌క్కడ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే ఎలా అంటూ హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని డాక్ట‌ర్‌ శంక‌ర్స్ ఆసుప‌త్రి నిర్మాణంలో నిబంధ‌న‌ల ఉల్ల‌ఘ‌న‌లు జ‌రిగాయ‌ని స్థానికులు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేయ‌గా.. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ శుక్ర‌వారం క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. ర‌హ‌దారుల‌ను ఆక్ర‌మించి.. 4 అంతస్తుల భ‌వ‌న నిర్మాణానికి అనుమ‌తులు తీసుకుని... సెల్లార్‌తో పాటు.. 6 అంత‌స్తుల‌ను ఎలా నిర్మిస్తార‌ని ఆసుప‌త్రి భ‌వ‌న య‌జ‌మాని డా. శంక‌ర్‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ప్ర‌శ్నించారు. అనుమ‌తులన్నిటినీ ప‌రిశీలించి.. చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

ఒక‌వైపు 10 అడుగుల దారి.. మ‌రోవైపు 15 అడుగుల దారి ఉన్న‌చోట ఇన్ని అంత‌స్తులు ఎలా నిర్మిస్తార‌ని.. అందుకు అనుమ‌తులు చూపించాల‌ని భ‌వ‌న య‌జ‌మానిని కోరారు. నివాస ప్రాంతాల మ‌ధ్య ఇరుకు ర‌హ‌దారుల్లో దీనిని నిర్మించార‌ని.. భ‌విష్య‌త్తులో ఏమైనా ప్ర‌మాదం జ‌రిగితే ఎవ‌రు బాధ్య‌త వహిస్తార‌ని సంబంధిత అధికారుల‌ను అడిగారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండా ఆస్పత్రికి ఎలా లైసెన్స్ మంజూరు చేశారని అధికారులను నిలదీశారు. దీనిపై పూర్తి వివ‌రాల‌తో నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ సికింద్రాబాద్‌ జోనల్ చీఫ్ ప్లాన‌ర్‌ శ్రీనివాస్‌ను కోరారు. హైడ్రా ఫైర్ విభాగం అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ పాప‌య్య‌, డీఎఫ్‌వో య‌జ్ఞ నారాయ‌ణతో పాటు ప‌లువురు హైడ్రా అధికారులు క‌మిష‌న‌ర్ వెంట ఉన్నారు.

ఆందోళనలో టౌన్ ప్లానింగ్ అధికారులు

ఆర్టీసీ క్రాస్ రోడ్డులో శంకర్ ఆస్పత్రి నిర్మాణానికి అనుమతులు జారీచేసిన టౌన్ ప్లానింగ్ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లంచాలు తీసుకుని అనుమతులు జారీచేస్తున్నారని విమర్శిస్తున్నారు. దీనిపై నివేదిక ఇవ్వాలని హైడ్రా కమిషనర్ ఆదేశించడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే శంకర్ ఆస్ప్రతి భవన నిర్మాణ అనుమతులపై సీసీపీ శ్రీనివాస్ ను సికింద్రాబాద్ జోనల్ సీపీ శ్రీనివాస్ కలిసి చర్చించారు. కమిషనర్ ఆర్వీ కర్ణన్ అనుమతి తీసుకుని ఈ భవన నిర్మాణానికి సంబంధించిన నివేదిక ఇవ్వడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

Next Story