ఎట్టకేలకు హైకోర్టుకు హాజరైన హైడ్రా చీఫ్ రంగనాథ్.. కంటెంప్ట్ పిటిషన్‌ కొట్టివేత

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-05 08:57:17  IST  )

అంబర్‌పేటలోని బతుకమ్మకుంట పరిరక్షణకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్ (AV Ranganath) శుక్రవారం తెలంగాణ హైకోర్టులో వ్యక్తిగతంగా హాజరయ్యారు.

ఎట్టకేలకు హైకోర్టుకు హాజరైన హైడ్రా చీఫ్ రంగనాథ్.. కంటెంప్ట్ పిటిషన్‌ కొట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: అంబర్‌పేటలోని బతుకమ్మకుంట పరిరక్షణకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్ (AV Ranganath) శుక్రవారం తెలంగాణ హైకోర్టులో వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ మేరకు కోర్టు ఆదేశాల ఉల్లంఘనతో తాను తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ రంగనాథ్ ధర్మాసనం ఎదుట క్షమాపణలు చెప్పారు. కోర్టు ఆదేశాలు తెలియకుండానే పనులు జరిగాయని, ఇలాంటి పొరపాటు భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రంగనాథ్ పూర్తి వాదనలను విన్న తర్వాత ధర్మాసనం ఆయన క్షమాపణను రికార్డు చేసుకుంటూ కంటెంప్ట్ పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే, ఈ కేసులో ఇతర అంశాలపై తదుపరి విచారణకు ఈనెల 18కి కోర్టు వాయిదా వేసింది.

కాగా, జూన్ 12న బతుకమ్మకుంట పరిరక్షణకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కో ఆదేశాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉల్లంఘించినట్లుగా ఆరోపిస్తూ భూ యజమాని ఎడ్ల సుధాకర్ రెడ్డి (Edla Sudhakar Reddy) హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కోర్టు నుంచి ఆదేశాలు జారీ అయిన తర్వాత కూడా హైడ్రా అధికారులు ఆ భూమిపై బుల్‌డోజర్లతో పనులు కొనసాగించారని పిటిషనర్ ఆరోపించారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు ధర్మాసనం గత విచారణలో భాగంగా రంగనాథ్‌ను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది.

Next Story