బాధితులకు హైడ్రా భరోసా

by Malleboina Mahesh |

చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణలో నష్టపోయిన వారికి హైడ్రా భరోసా కల్పించనుంది. బాధితులకు టీడీఆర్ రూపంలో పరిహారం ఇవ్వాలని భావిస్తోంది.

బాధితులకు హైడ్రా భరోసా
X

దిశ, తెలంగాణ బ్యూరో : చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణలో నష్టపోయిన వారికి హైడ్రా భరోసా కల్పించనుంది. బాధితులకు టీడీఆర్ రూపంలో పరిహారం ఇవ్వాలని భావిస్తోంది. అర్హులను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. హైడ్రా ఆధ్వర్యంలో ఇప్పటి వరకు రూ.50 వేల కోట్ల విలువైన ఆస్తులు కాపాడారు. ఇందులో ప్రభుత్వ భూములు 424 ఎకరాలు, రోడ్ల ఆక్రమణలు 218 ఎకరాలు, చెరువుల కబ్జాలు 233 ఎకరాలు, పార్కుల ఆక్రమణలు 25 ఎకరాలు, ఆక్రమ నిర్మాణాలు ఏడెకరాలు.. ఇలా మొత్తం 923.14 ఎకరాల భూములను హైడ్రా పరిరక్షించింది. దీంతో పాటు చెరువుల పునరుద్ధరణ పైన హైడ్రా దృష్టి సారించింది. బతుకమ్మకుంట తరహాలోనే సున్నం చెరువు, తమ్మిడికుంట, ఉప్పల్ నల్లచెరువు, భమృక్ ధౌలా, కూకట్‌పల్లిలోని నల్లచెరువులను రూ.58.40 కోట్లతో పునరుద్ధరణ చేస్తున్నది.

బాధితులకు టీడీఆర్..

నగరంలోని భుమృక్ ఉద్ధౌలా చెరువు, బతుకమ్మకుంట, కూకట్‌పల్లి నల్లచెరువు, సున్నం చెరువు, మాదాపూర్‌లోని తమ్మిడికుంట, ఉప్పల్ నల్లచెరువుల ఎఫ్‌టీఎల్‌లను గుర్తించి అక్కడి ఆక్రమణలను తొలగించిన విషయం తెలిసిందే. చెరువుల పరిరక్షణ చర్యలపై హర్షం వ్యక్తం అవుతున్నా.. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో తక్కువ ధరకు భూమి కొనుగోలు చేసి నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలకు అన్యాయం జరుగుతుందన్న విమర్శలున్నాయి. ఈ క్రమంలో మానవీయ కోణంలో స్పందించిన హైడ్రా బాధితులకు ప్రత్యామ్నయంగా భూమి, ఇల్లు లేని వారికి ట్రాన్స్‌ఫర్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) ఇప్పించాలని భావిస్తున్నది. ఈ మేరకు హైడ్రా ప్రతిపాదనలు సిద్ధం చేసి సర్కారుకు పంపాలని నిర్ణయించింది.

రూ.111 కోట్ల విలువైన భూమి సేఫ్

రంగారెడ్డి జిల్లా రాజేంద్రన‌గ‌ర్, బాలాపూర్ మండ‌లాల్లో 976 గ‌జాల్లో ఉన్న పార్కుతో పాటు 1.28 ఎక‌రాల ప్రభుత్వ భూమిని హైడ్రా ఆక్రమణదారుల నుంచి గురువారం కాపాడింది. ఈ భూముల విలువ రూ.111 కోట్లకు పైగా ఉంటుంద‌ని అంచ‌నా. మైలార్‌దేవుప‌ల్లి గ్రామంలోని శాస్త్రీపురం కాల‌నీలో 976 గజాల పార్కు స్థలం చుట్టూ గ‌తంలో మున్సిప‌ల్ అధికారులు ఫెన్సింగ్ వేశారు. కొంత మంది త‌ప్పుడు డాక్యుమెంట్లతో పార్కు స్థలాన్ని క‌బ్జా చేస్తున్నార‌ని అక్కడి ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు హైడ్రా చ‌ర్యలు తీసుకుంది. బాలాపూర్ మండ‌లం జిల్లేలుగూడ విలేజ్‌లో స‌ర్వే నంబ‌ర్ 76లోని 1.28 ఎక‌రాల ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన ఆక్రమ‌ణ‌ల‌ను హైడ్రా గురువారం తొల‌గించింది. కొంత‌ మంది ఫేక్ ప‌ట్టాలు సృష్టించి ప్లాట్లుగా విక్రయించ‌డంతో పాటు.. ఆక్రమ‌ణ‌ల‌కు పాల్పడుతున్నారంటూ హైడ్రాకు ఫిర్యాదు అంద‌గానే చ‌ర్యలు తీసుకుంది. పార్కుతో పాటు.. ప్రభుత్వ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది.

Next Story