హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ‘యోగా మహోత్సవ్’

by Disha Web Desk 16 |
హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ‘యోగా మహోత్సవ్’
X
  • 25 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభం
  • పాల్గొన్న గవర్నర్, కేంద్ర మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు
  • స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోగా మహోత్సవ్ 25 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగింది. పరేడ్ గ్రౌండ్ లో శనివారం ఉదయం 5:30 గంటలకు ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. యోగా జ్ఞానం, సంపద, జీవన విధానమని పేర్కొన్నారు. జూన్ 21న చేపట్టే ప్రపంచ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న యోగాను ప్రధాని మోడీ ప్రపంచానికి పరిచయం చేశారన్నారు. జూన్ 21న ప్రతి ఇంట్లో, ప్రతి బస్తీలో, ప్రతి గ్రామంలో, పట్టణాల్లో ఎవరికి వారుగా యోగా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రకృతిని, మనిషిని సంలీనం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే శాస్త్రీయమైన పక్రియకు సరైన గౌరవాన్నిస్తూ యోగా డేను జరుపుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.

100 రోజులపాటు దేశవ్యాప్తంగా యోగా బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుంటున్నామని ఆయన చెప్పుకొచ్చారు. మార్చి 13న 100 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభించామని ఆయన తెలిపారు. 100 రోజుల కౌంట్ డౌన్‌ను ఢిల్లీలో, 75 రోజుల కౌంట్ డౌన్‌ను అస్సాంలో, 50 రోజుల కౌంట్ డౌన్‌ను జైపూర్‌లో నిర్వహించామన్నారు. 25 రోజుల కౌంట్ డౌన్‌కు హైదరాబాద్ వేదికగా మారిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా యోగా సాధనను ప్రోత్సహించడంలో ఇది ఓ బెంచ్ మార్క్‌గా నిలిచిపోనుందని కేంద్ర మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర ఆయుష్, ఓడరేవుల, షిప్పింగ్ అండ్ జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, కార్మిక-ఉపాధి పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, కేంద్ర ఆయుష్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి ముంజపరా మహేంద్రభాయ్ కాళూభాయ్, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజలు స్వచ్ఛందంగా ఈ యోగా మహోత్సవ్‌కు తరలివచ్చారు.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channelNext Story

Most Viewed