- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సికింద్రాబాద్’కు ప్రపంచస్థాయి హంగులు
ప్రపంచ స్థాయి సౌకర్యాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటున్నది. రైల్వే స్టేషన్ పునరాభివృద్ధిలో భాగంగా

దిశ, సికింద్రాబాద్ : ప్రపంచ స్థాయి సౌకర్యాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటున్నది. రైల్వే స్టేషన్ పునరాభివృద్ధిలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను దాదాపు రూ.714 కోట్లను దక్షిణ మధ్య రైల్వే కేటాయించింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లతో స్టేషన్ పునరాభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్‌ను ఎన్ఎస్ జీ1 స్టేషన్ (నాన్ సబర్బన్ గ్రేడ్ 1)గా వర్గీకరించారు. సంవత్సరానికి రూ.500 కోట్ల ఆదాయం, 20 మిలియన్ల ప్రయాణికులు ప్రయాణిస్తున్న స్టేషన్లు ఎన్ఎస్ జీ1 స్టేషన్ కిందకు వస్తాయి. రాష్ట్ర రాజధానిలో ఉన్న ఈ స్టేషన్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ స్టేషన్‌లో సగటున రోజుకు 180 రైళ్లు ప్రయాణిస్తున్నాయి. రోజుకు 1.5 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. రాబోయే రోజుల్లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందనే అంచనాతో ఆధునిక సౌకర్యాలతో స్టేషన్‌ను మరింత అభివృద్ధి చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని స్టేషన్ కాంప్లెక్స్‌ను ప్రపంచ స్థాయి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలతో రూపొందిస్తున్నారు.
పునరాభివృద్ధి పనులివే..
- జీ+3 అంతస్తులతో నార్త్ సైడ్ వైపున కొత్త ఐకానిక్ స్టేషన్ బిల్డింగ్స్ జీ+3 అంతస్తులతో సౌత్ సైడ్ భవనం.
- రిటైల్, కేఫ్టేరియాలు, వినోద సౌకర్యాల కోసం స్థలాలతో పాటు ఒకే చోట అన్ని రకాల ప్రయాణికుల సౌకర్యాలతో డబుల్ స్టోరీ స్కై కాన్కోర్స్ స్టేషన్.
- నార్త్ సైడ్ బహుళస్థాయి పార్కింగ్, సౌత్ సైడ్ అండర్ గ్రౌండ్ పార్కింగ్.
- నార్త్, సౌత్ వైపున రెండు ట్రావెలేటర్లతో సహా రెండు వాక్‌వేలు (7.5 మీ) నిర్మాణం.
26 లిఫ్ట్‌లు, 32 ఎస్కలేటర్లు, ట్రావెలేటర్లతో పాటు ఒక ఎఫ్ ఓ బీ (4.5 మీ), స్టేషన్‌లో మరొక ఎఫ్ ఓ బీ (7.0 మీ), స్కైవాక్ (9.0 మీ) 7255 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈస్ట్, వెస్ట్ మెట్రో స్టేషన్ల స్కైవేతో అనుసంధానిస్తూ నార్త్ సైడ్ వాక్‌వే ఏర్పాటు.
- కొత్త స్టేషన్ వాతావరణానికి అనుగుణంగా ఉన్న ప్లాట్‌ఫారమ్‌ల పునరుద్ధరణ,
రాక అండ్ బయలుదేరే ప్రయాణికుల క్రాస్ కదలికలను, వాహనాల కదలికలను నివారించడానికి ప్రత్యేక ఎంట్రీ అండ్ ఎగ్జిట్ బ్లాక్‌ల ఏర్పాటు.
- 5000 కేడబ్ల్యూవీ సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు.
స్టేషన్ పునరాభివృద్ధిలో ప్రధాన లక్ష్యాలు..
మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్ అండ్ ప్రయాణికులను ఒక మోడ్ నుంచి మరొక మోడ్‌కు సజావుగా బదిలీ చేయడం, రైలు ప్రయాణికుల మెరుగైన కనెక్టివిటీ, మొబిలిటీ, ప్రయాణికులకు అనుకూలమైన పికప్, డ్రాప్ ప్రాంతాలు, తగినంత పార్కింగ్ సౌకర్యం, తిరుగుతున్న ప్రాంతంలో రద్దీని తగ్గించడం, నగర రహదారి నెట్‌వర్క్‌తో అనుసంధానించడం, వ్యాపార అవకాశాలు, ఆదాయ ఉత్పత్తిని సృష్టించడం దిశగా ఈ స్టేషన్ పునరాభివృద్ధి పనులు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
పునరాభివృద్ధి పనుల వివరాలు..
నార్త్ సైడ్ ఉన్న బుకింగ్ కార్యాలయం స్థానంలో తాత్కాలిక బుకింగ్ కార్యాలయం నిర్మించారు. నూతన ఆర్పిఎఫ్ భవనం పనులు పూర్తయ్యాయి. సౌత్ సైడ్ చేపడుతున్న బేస్మెంట్ నిర్మాణ పనులు దాదాపు 95శాతం పూర్తయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్ లెవల్ రోడ్లు, డ్రెయిన్లు అండ్ ఇతర సివిల్ పనులు పూర్తయ్యాయి. సౌత్ సైడ్ ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వెళ్లే ప్రయాణికులకు డ్రాప్ ఆఫ్ జోన్‌గా ఉండగా, బేస్మెంట్ 1 దక్షిణం వైపు వచ్చే ప్రయాణికులకు పికప్ జోన్‌గా ఉంటుంది. బేస్మెంట్ 2 వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కోసం ఏర్పాటు చేశారు. ఇది దాదాపు 200 ఫోర్ వీలర్ వాహనాలను నిలిపే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మిగిలిన పనిని పూర్తి చేయడానికి, వాహనాల సజావుగా కదలికను నిర్ధారించడానికి, ప్రస్తుత స్టేషన్ భవనం సౌత్ సైడ్ ఉన్న అప్రోచ్ వైపు ప్రయాణికుల కోసం తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేశారు.
ప్లాట్‌ఫామ్ 10 వద్ద, టూ వీలర్ పార్కింగ్ కోసం 960 చదరపు మీటర్లు, ఫోర్ వీలర్ల కోసం 2031 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు, ఈ పార్కింగ్‌ను తాత్కాలికంగా ప్లాట్‌ఫామ్ 10 వైపున ఉన్న బేస్‌మెంట్ పార్కింగ్‌కు మార్చారు. బేస్‌మెంట్ పార్కింగ్‌లో దాదాపు 200 కార్లను ఉంచవచ్చు. వీటిని సౌలభ్యం ప్రకారం కార్లు, టూ వీలర్ల కోసం ఉపయోగించవచ్చు.
సౌత్ వైపున ఉన్న భవనాన్ని విస్తరిస్తూ నూతన భవనం ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 55శాతం పని పూర్తయింది. 2వ అంతస్తు వరకు స్తంభాలు వేయడం, స్లాబ్ షట్టరింగ్ పని జరుగుతుంది. నార్త్ సైడ్ ఉన్న గణేశ్ టెంపుల్ సమీపంలో మల్టీ-లెవల్ కార్ పార్కింగ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇవి దాదాపు 95శాతం పనులు పూర్తయ్యాయి. స్టేషన్ బిల్డింగ్ నార్త్ సైడ్ 6వ అంతస్తుల ఎంఎల్సీపీ ఉంటుంది. ప్రస్తుతం, పునాది పనులు పూర్తయ్యాయి. ప్లాట్‌ఫారమ్ 1 వద్ద, టూ వీలర్ పార్కింగ్ కోసం 759 చదరపు మీటర్ల స్థలం, ఫోర్ వీలర్లకు 2465 చదరపు మీటర్ల విస్తీర్ణంలో స్థలం కేటాయించారు. ఈ పార్కింగ్ ఇప్పటికీ ఆపరేషన్‌లో ఉంది. పూర్తయిన తర్వాత, ప్లాట్‌ఫారమ్ 1 పార్కింగ్ ఇక్కడికి మార్చబడుతుంది. నార్త్ సైడ్ బేస్మెంట్ (బేస్మెంట్ + గ్రౌండ్ + మెయిన్ + 2 అంతస్తులు) ఉన్న ప్రధాన భవనం, యుటిలిటీ రీలొకేషన్ పనులు పూర్తయ్యాయి. సివిల్ నిర్మాణం పూర్తయింది. మల్టీ లెవల్ కార్ పార్కింగ్ వైపు ఫినిషింగ్ పనులు జరుగుతున్నాయి. సెంట్రల్ ఎఫ్ఓబీ ప్రాంతంలో తాత్కాలిక వెయిటింగ్ హాళ్లు, కొన్ని ఆఫీస్ గదులు ఏర్పాటు చేశారు.
స్టేషన్ డిమాండ్లకు అనుగుణంగా విద్యుత్ స్టేషన్లు..
స్టేషన్ డిమాండ్లకు అనుగుణంగా అవసరమైన నూతన విద్యుత్ సబ్ స్టేషన్ల సామర్థ్యం పెంచి ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుత 11 కేవీ స్థానంలో 33 కేవీ సామర్థ్యం ఉన్న రెండు ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్లు రానున్నాయి. దీని ప్రకారం సౌత్ సైడ్ ఒక 33 కేవీఈఎస్ ఎస్ కోసం పనులు ప్రారంభించబడ్డాయి. ఇప్పటికే సివిల్ ఫ్రేమ్ నిర్మాణం, గోడలు పూర్తయ్యాయి.






