సాయిబాబా భక్తుల మనోభావాలను గౌరవిస్తాం.. వివాదంపై మంత్రి ఆనం క్లారిటీ

by Ramesh Naini |

సాయిబాబా ఆలయాల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి దుష్ప్రచారం చేయడం సరికాదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.

సాయిబాబా భక్తుల మనోభావాలను గౌరవిస్తాం.. వివాదంపై మంత్రి ఆనం క్లారిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: సాయిబాబా ఆలయాల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి దుష్ప్రచారం చేయడం సరికాదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

తాను కూడా సాయి భక్తుడినే

తాను వ్యక్తిగతంగా సాయిబాబా భక్తుడినని, ప్రతిరోజూ పూజా మందిరంలో స్వామివారిని పూజించిన తర్వాతే తన దినచర్య ప్రారంభిస్తానని మంత్రి స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల వల్ల ఏ ఒక్క భక్తుడి మనోభావాలు దెబ్బతిన్నా హృదయపూర్వకంగా మన్నించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ లేదా టీటీడీ ఎవరిపైనా వివక్ష చూపడం లేదని, ఎవరైనా ఆరాధించే మహనీయులను కించపరిచే ఉద్దేశం తమకు లేదని పేర్కొన్నారు. హిందూ సంప్రదాయాల ప్రకారమే సాయిబాబా ఆలయాల్లో పూజలు జరుగుతున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే అన్నారు.

ఆ నిధులు నిబంధనల మేరకే

టీటీడీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 5,000 భజన మందిరాల కార్యక్రమం సనాతన హిందూ ధర్మ పరిరక్షణ, గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ దేవాలయాల నిర్మాణం అనే నిర్దిష్ట లక్ష్యంతో చేపట్టామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిబంధనలు, పరిపాలనా విధానాల ప్రకారమే వీటికి నిధులు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. కేవలం ట్రస్ట్ లక్ష్యాలు, నిబంధనల ఆధారంగానే నిధుల కేటాయింపు జరుగుతోందని, ఈ పథకం కింద సాయిబాబా ఆలయాలకు నిధులు ఇవ్వకపోవడం అంటే స్వామివారిని లేదా భక్తులను అవమానించినట్లు కాదని మంత్రి వివరణ ఇచ్చారు. రాముడు, కృష్ణుడు, శివుడు, సాయిబాబా.. ఇలా ప్రజలు ఆరాధించే ఏ విశ్వాసాన్నీ ప్రభుత్వం కించపరచదని ఆనం స్పష్టం చేశారు. కేవలం ట్రస్టుల నిబంధనలు, పరిపాలనా విధానాలకు సంబంధించిన అంశాన్ని అనవసర వివాదంగా మార్చొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ఎవరూ నమ్మవద్దని మంత్రి కోరారు.

Next Story