శ్రీవారి భక్తులకు భద్రత.. తిరుమల కొండపై ‘ఆక్టోపస్’ కమాండోల మాక్ డ్రిల్

by Ramesh Naini |

తిరుమలలో శ్రీవారి భక్తుల భద్రతను మరింత పటిష్టం చేయడానికి ఆక్టోపస్ దళం ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహించింది.

శ్రీవారి భక్తులకు భద్రత.. తిరుమల కొండపై ‘ఆక్టోపస్’ కమాండోల మాక్ డ్రిల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమలలో శ్రీవారి భక్తుల భద్రతను మరింత పటిష్టం చేయడానికి ఆక్టోపస్ దళం ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహించింది. ఉగ్రవాద దాడులు లేదా అత్యవసర పరిస్థితులు తలెత్తిన సందర్భంలో భక్తులను సురక్షితంగా తరలించడం, తక్షణ స్పందన చర్యలు చేపట్టడం, శత్రువులను వ్యూహాత్మకంగా అణచివేయడం వంటి అంశాలపై కమాండోలు సాధన నిర్వహించారు. టీటీడీ విజిలెన్స్ విభాగం, స్థానిక పోలీసుల సమన్వయంతో నిర్వహించిన ఈ విన్యాసాలు ఆలయ పరిసరాలు, లడ్డూ పోటు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వంటి రద్దీ ప్రాంతాల్లో సాగాయి.

బందీల విముక్తి చర్యలు, అత్యవసర పరిస్థితుల నిర్వహణపై కమాండోలు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. రానున్న బ్రహ్మోత్సవాలు, పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ఈ మాక్ డ్రిల్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. భక్తుల రక్షణకు భద్రతా బలగాలు ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉన్నాయనే సందేశాన్ని ఈ విన్యాసాలు స్పష్టం చేశాయి. కాగా, అత్యాధునిక ఆయుధాలు, రక్షణ సామాగ్రితో సన్నద్ధమైన సుమారు 50 మంది ఆక్టోపస్ కమాండోలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

Next Story