- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
300 గజాల స్థలం కోసం ఉన్మాదిలా ఓ కొడుకు.. కన్నతండ్రిపై విచక్షణారహితంగా దాడి
రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పరపల్లిలో పట్టపగలే అమానుష ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆస్తి కోసం రక్త సంబంధాలు సైతం రక్తసిక్తంగా అవుతున్నాయి. జీవితకాలం కష్టపడి సంపాదించిన భూమిని కుమారులకు సమానంగా పంచినా.. ఓ వృద్ధ తండ్రి సొంత కొడుకు చేతిలోనే దెబ్బలు తినాల్సి వచ్చిన హృదయవిదారక ఘటన హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజేంద్రనగర్ మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన అనంత్‌రెడ్డి అనే వృద్ధుడికి కొంత భూమి ఉంది. ఆయన తనకున్న 31 గుంటల భూమిని తన ఇద్దరు కుమారులకు ఎలాంటి తగువు లేకుండా సమానంగా పంచిపెట్టాడు. అయితే, తన శేషజీవితానికి, వృద్ధాప్య అవసరాలకు ఆసరాగా ఉంటుందని భావించి కేవలం 300 గజాల స్థలాన్ని మాత్రం తన పేరుమీదే ఉంచుకున్నాడు.
చిన్న కుమారుడి ఘాతుకం..
తండ్రి తన రక్షణ కోసం ఉంచుకున్న ఆ 300 గజాల స్థలంపై కూడా చిన్న కుమారుడు ఓం రెడ్డి కన్ను పడింది. ఆ భూమిని కూడా తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలంటూ గత కొంతకాలంగా తండ్రిపై ఓం రెడ్డి తీవ్ర ఒత్తిడి తెస్తున్నాడు. ఈ క్రమంలోనే మాట వినలేదనే కోపంతో వృద్ధుడనే దయ కూడా లేకుండా కన్నతండ్రిపై ఓం రెడ్డి విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. అయితే, కొడుకు చేసిన దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో బయటకు రావడంతో ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితుడు అనంత్ రెడ్డి తీవ్ర ఆవేదనతో రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఆస్తి రాసివ్వకపోతే త్వరలోనే తనను చంపేస్తానంటూ కుమారుడు ఓం రెడ్డి బెదిరిస్తున్నాడని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వృద్ధుడి ఫిర్యాదును స్వీకరించిన రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ముమ్మరం చేశారు.





