సువర్ణ అధ్యాయం.. జొన్నగిరిని స్వర్ణగిరిగా పిలుద్దామా?: సీఎం చంద్రబాబు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-24 09:39:19  IST  )

సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా జొన్నగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జొన్నగిరిలో బంగారం నిధులు ఉండటంపై ఆయన ఆసక్తికర ప్రసంగం చేశారు. ..

సువర్ణ అధ్యాయం..  జొన్నగిరిని స్వర్ణగిరిగా పిలుద్దామా?: సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) కర్నూలు జిల్లా జొన్నగిరి(Kurnool district Jonnagiri)లో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జొన్నగిరిలో బంగారం నిధులు ఉండటంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జొన్నగిరి ఘనత నేటిది కాదని, ఎంతో చరిత్ర ఉందని, ఈ ప్రాంతాన్ని సువర్ణగిరి అని పిలిచేవారని గుర్తు చేశారు. అశోకుడి నాలుగు రాజధానుల్లో సువర్ణగిరి, ఈనాటి జొన్నగిరి అని తెలిపారు. వందల సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతం బంగారం, రత్నాలతో నిండిందని చెప్పారు. ఇక్కడకు దగ్గరలో లభించిన అశోకుడి ఎర్రగుడి శాసనాలు ఈ ప్రాంత వైభవాన్ని చెబుతున్నాయన్నారు. రాయలసీమ అంటేనే రతనాల సీమ అని, శ్రీకృష్ణదేవరాయుల కాలంలో సీమలో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారని పేర్కొన్నారు.

ఆ ఘనత మన రాష్ట్రానిదే

‘‘ప్రపంచానికి కోహినూర్ వజ్రాన్ని అందించిన ఘనత మన రాష్ట్రానిదే. కాలక్రమేనా రాయలసీమ ఎడారిగా మారే పరిస్థితులు తలెత్తాయి. ప్రాజెక్టులు పూర్తి చేసి, సాగునీరు ఇచ్చి సీమకు మళ్లీ జీవం పోశాం. గోల్డ్ మైనింగ్‌తో సీమకు పూర్వ వైభవం వస్తుంది. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ ప్రాజెక్టుపై రూ.405 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టారు. జొన్నగిరి బదులు ఈ ప్రాంతానికి మళ్లీ స్వర్ణగిరి అని పేరు పెట్టుకుందాం. 2047కు దేశాన్ని వికసిత్ భారత్‌గా తయారు చేయాలన్నది ప్రధాని మోదీ కల. మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తయారు చేయాలన్నది నా ఆలోచన. నిన్నటి వరకూ జొన్నగిరిగా ఉన్న ఈ ప్రాంతం పేరును ఇక నుంచి స్వర్ణగిరిగా మార్చుకుందాం. ఇక్కడ గోల్డ్ మైన్ వచ్చింది. ఇక్కడి ప్రజల జీవితాలు కూడా స్వర్ణమయం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని స్వర్ణగిరి మోడల్ విలేజ్‌గా అభివృద్ధి చేస్తారు. రాయలసీమను రతనాల సీమగా తయారు చేస్తామని చెప్పిన మాటను నెరవేర్చుకుంటున్నాం. స్వర్ణగిరి గ్రామం నుంచే ఈ ప్రణాళిక ప్రారంభం అయ్యింది. ఇక దేశమంతా స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ గురించే మాట్లాడుతుంది. దేశం ఇప్పుడు 800 కిలోల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. చమురు తర్వాత ఇదే అతిపెద్ద దిగుమతి. బంగారం అంటే మనందరికీ ఎంతో మమకారం. బంగారం ఉంటే మనకు గౌరవంగా భావిస్తాం.’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఏడాదికి 1 టన్ను బంగారం ఉత్పత్తి

‘‘జోన్నగిరిలో ఏడాదికి 1 టన్ను బంగారం ఉత్పత్తి అవుతుంది. తొలి ఏడాది 400 కిలోలు నుంచి ప్రారంభించి 50 మెట్రిక్ టన్నుల బంగారం ఉత్పత్తికి చేరుకుంటాం. ఏటా ఉత్పత్తి అయ్యే 1 టన్ను బంగారంతో విదేశీ మారక నిల్వల్ని కొంత కాపాడుకోవచ్చు. స్థానిక యువతకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా వస్తాయి. ఈ గోల్డ్ మైన్ ప్రాజెక్ట్ ఈ ప్రాంత అభివృద్దికి ఒక గ్రోత్ ఇంజిన్ అవుతుంది.’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Next Story