యూరియా యాప్‌ రద్దు చేయాలని రైతుల రాస్తారోకో

by Ratna Kumari |

నాగిరెడ్డిపేట్ మండలంలోని ధర్మారెడ్డి గ్రామ రైతులు యూరియా పంపిణీ కోసం అమలు చేస్తున్న యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.

యూరియా యాప్‌ రద్దు చేయాలని రైతుల రాస్తారోకో
X

దిశ, నాగిరెడ్డిపేట్ : నాగిరెడ్డిపేట్ మండలంలోని ధర్మారెడ్డి గ్రామ రైతులు యూరియా పంపిణీ కోసం అమలు చేస్తున్న యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్‌ వల్ల నిరక్షరాస్యులైన రైతులకు అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రైతు వద్ద స్మార్ట్‌ఫోన్‌ లేదని, కొంతమందికి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడంతో యాప్‌ ఆధారిత బుకింగ్‌ విధానం మరిన్ని ఇబ్బందులు సృష్టిస్తోందని ఆరోపించారు. అసైన్మెంట్ భూముల్లో సాగు చేసే రైతులు, చిన్న, సన్నకారు రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. యూరియా పంపిణీలో అమలు చేస్తున్న యాప్‌ విధానాన్ని వెంటనే రద్దు చేసి రైతులకు నేరుగా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుగంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్సై భార్గవ్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు. మండలంలో యూరియా కొరత లేదని, యాప్ అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ధర్మారెడ్డి గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ జయరాజ్‌తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

Next Story