అరెస్టులో పోలీసుల నిర్లక్ష్యం ఎందుకు?

by Elthuri vijay kumar |

ఎల్బీనగర్ లోని ‘కృతిక ఇన్ ఫ్రా డెవలపర్స్ సంస్థ ఫ్రీలాంచింగ్​లో మోసపోయిన బాధితులు ఎల్బీనగర్​డీసీపీ ఆఫీస్​ఎదుట ఆందోళనకు దిగారు.

అరెస్టులో పోలీసుల నిర్లక్ష్యం ఎందుకు?
X

అరెస్టులో పోలీసుల నిర్లక్ష్యం ఎందుకు?

‘కృతిక ఇన్​ఫ్రా డెవలపర్స్’ సంస్థ బాధితుల ఫైర్​

మోసం చేసిన ప్రతి ఒక్కరినీ అరెస్టు చేయాలని డిమాండ్

ఎల్బీనగర్ డీసీపీ ఆఫీస్​ ఎదుట ఆందోళన

సుమారు రూ.150 కోట్లు కొట్టేశారని ఆవేదన

దిశ, వనస్థలిపురం : ఎల్బీనగర్ లోని ‘కృతిక ఇన్ ఫ్రా డెవలపర్స్ సంస్థ ఫ్రీలాంచింగ్​లో మోసపోయిన బాధితులు ఎల్బీనగర్​డీసీపీ ఆఫీస్​ఎదుట ఆందోళనకు దిగారు. వెంచర్లు, విల్లాలు, ప్రీలాంచ్ పేరిట కస్టమర్ల నుంచి రూ. లక్షల్లో వసూలు చేసిన బోర్డు తిప్పేసిన ఘటనలో బాధితులు తమకు న్యాయం చేయాలని ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో ఎండీ దుమావత్ శ్రీకాంత్ పై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎల్బీనగర్​ఎస్​వోటీ పోలీసులు అదుపులోకి తీసుకుని ఎల్బీనగర్​పోలీసులకు అప్పగించగా.. 5 రోజుల కింద శ్రీకాంత్ ను అరెస్ట్​చేసి, రిమాండ్ తరలించారు. అయితే బుధవారం బాధితుల్లో 52 మంది ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని సీఐని ప్రశ్నించారు. అనంతరం డీసీపీ ఆఫీస్​కు వెళ్లి ఆఫీస్​ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కొక్కరి నుంచి సుమారు రూ. 20 నుంచి 50 లక్షల వరకు ఇచ్చామని, ఇక్కడి వచ్చిన వారినుంచే రూ.20 కోట్లకు పైగానే కొట్టేశారని చెల్లింపు పేపర్లు చూపించారు. శ్రీకాంత్ ను అరెస్టు చేసిన పోలీసులు మిగతా వారిని ఎందుకు అరెస్ట్​చేయడంలేదని ప్రశ్నించారు. వెంటనే మిగతా నిందితులను అరెస్ట్​చేయాలని డిమాండ్​చేశారు.

కృతిక ఇన్ ఫ్రా డెవలపర్స్ సంస్థ ఎండీ శ్రీకాంత్ 2022లో బోడుప్పల్, తట్టి అన్నారం, హేమనగర్, ఆదిభట్ల, సైదాబాద్, తుర్కయంజాల్, నాగోల్ - బండ్లగూడ తదితర ప్రాంతాల్లో వెంచర్లు ఏర్పాటు చేసి, అపార్ట్​మెంట్లు నిర్మించి ఇస్తామని ప్రచారం చేశాడని తెలిపారు. రెండేండ్లు గడుస్తున్నా ఎంతకూ పొజిషన్ ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు. దీంతో ఎండీ శ్రీకాంత్ పై ఎల్బీనగర్, వనస్థలిపురం, సరూర్ నగర్, సైదాబాద్ ఇతర పోలీస్ స్టేషన్లలో మొత్తం 16 కేసులు నమోదయ్యాయి. శ్రీకాంత్ తోపాటు తల్లి రాధ, తండ్రి గోపాల్, సోదరుడు శశికాంత్, మార్కెటింగ్ హెడ్ అరుణ్ కుమార్ పై ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఐదు రోజుల కింద ఎండీ శ్రీకాంత్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో నాలుగేళ్ల కిందనే ఒక్కో కస్టమర్​ నుంచి సుమారు రూ. 20 నుంచి 50, 80 లక్షలు... ఇలా చాలామంది నుంచి సుమారు 150 కోట్ల రూపాయలను ఎండీ శ్రీకాంత్ వసూలు చేసినట్లు బాధితులు చెప్పారు. కొనుగోలుదారులు తమ ప్లాట్లు ఎక్కడా? అని ప్రశ్నించగా.. అదిగో ఇదిగో అంటూ సమాధానం దాటవేస్తూ వచ్చాడు. సుమారు 150 మంది నుంచి డబ్బులు తీసుకుని ప్లాట్లు ఇవ్వలేదని బాధితులు వాపోతున్నారు. తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని ప్రశ్నిస్తే మాయమాటలు చెప్పి తప్పించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 40 మంది బాధిత కుటుంబాలు తమ గోడును మీడియాకు వెల్లడించారు. ప్రజలను మోసం చేసిన కృతిక ఇన్ ఫ్రా డెవలపర్స్ సంస్థలోని ప్రతి ఒక్కరిని అరెస్టు చేయాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Next Story