- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అడ్డగోలుగా ఫ్లెక్సీలు.. ప్రమాదాలు జరిగితే ఎవరిది బాధ్యత..?
మణికొండ సర్కిల్ పరిధిలో కొందరు అడ్డగోలుగా, ఎలాంటి అనుమతులు లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

దిశ, గండిపేట: మణికొండ సర్కిల్ పరిధిలో కొందరు అడ్డగోలుగా, ఎలాంటి అనుమతులు లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులతో పాటు వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మొన్నటి వరకు సర్కిల్ పరిధిలోని వివిధ కాలనీలు, ప్రాంతాల్లో రెజోనెన్స్ పాఠశాల నిర్వాహకులు భారీ పరిమాణంలో ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్తంభాలకు కూడా కొన్ని ఫ్లెక్సీలు కట్టారు. ఇదిలా ఉండగాజజ సదరు పాఠశాలకు ఎలాంటి అనుమతులు లేకపోవడం గమనార్హం. తమ పాఠశాలలో చేరబోయే విద్యార్థులకు భారీగా ఉపకార వేతనాలు ఇస్తున్నామని పాఠశాల యాజమాన్యం భారీగా బిల్డప్పులు ఇచ్చింది.
పాఠశాలకు ఎలాంటి అనుమతులు లేవని జిల్లా విద్యాశాఖ అధికారి స్పష్టం చేయడంతో చివరకు ఆన్ లైన్ లో గుట్టుగా పరీక్ష నిర్వహించడం గమనార్హం. అయితే రెజొనెన్స్ పాఠశాల నిర్వాహకులు మణికొండ సర్కిల్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే భారీ స్థాయిలో పబ్లిసిటీ కోసం విచ్చలవిడిగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన నిర్వాహకులపై జరిమానాలు విధించాల్సి ఉండగా.. మున్సిపల్ అధికారులు ఆ విధంగా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
ప్రమాదం జరిగితే.. బాధ్యత ఎవరు..?
ఇక కొన్ని రోజులుగా అధ్యాపక్ జూనియర్ కళాశాల నిర్వాహకులు సైతం మణికొండ సర్కిల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో, ప్రధాన రహదారులకు పక్కన ఎలాంటి అనుమతులు లేకుండానే భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో గాలికి ఫ్లెక్సీలు చినిగిపోయి రోడ్డుపై పడిపోయాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్లేవాళ్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు.
ఫ్లెక్సీ తొలగించినా.. విధించని జరిమానా..
అడ్డగోలుగా ఫ్లెక్సీల ఏర్పాటు వ్యవహారం చివరకు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో నిద్రలో నుంచి మణికొండ సర్కిల్ అధికారులు మేల్కొన్నారు. చివరకు వాటిని మంగళవారం డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగించారు. ప్రమాదకరంగా ఏర్పాటు చేసినా అధికారులు నిర్వాహకులకు ఎలాంటి జరిమానాలు విధించలేదని తెలుస్తున్నది. ఈ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అడ్డగోలుగా ఫ్లెక్సీల ఏర్పాటు విషయమై సర్కిల్ మేనేజర్ శ్రీధర్ ను వివరణ కోరేందుకు ఫోన్ లో యత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.






