బీసీయూఎఫ్ పార్టీనీ ఇవ్వమని తీన్మార్ మల్లన్న అడిగితే మేం నిరాకరించాం

by Elthuri vijay kumar |

భారీ నగదు ఇచ్చి కొనుగోలు చేసినట్లు అసత్య ప్రచారం చేయించారు.. బీసీయూఎఫ్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు పాలురి రామకృష్ణయ్య

బీసీయూఎఫ్ పార్టీనీ ఇవ్వమని తీన్మార్ మల్లన్న అడిగితే మేం నిరాకరించాం
X

బీసీయూఎఫ్ పార్టీనీ ఇవ్వమని తీన్మార్ మల్లన్న అడిగితే మేం నిరాకరించాం

భారీ నగదు ఇచ్చి కొనుగోలు చేసినట్లు అసత్య ప్రచారం చేయించారు

బీసీయూఎఫ్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు పాలురి రామకృష్ణయ్య

దిశ ఖైరతాబాద్ : ఏ ఒక్క పార్టీలో నిలకడగా లేకుండా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మోచేతి నీళ్లు తాగిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు బీసీల నాయకుడిగా ప్రచారం చేసుకుంటున్నారని బీసీయూఎఫ్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు పాలురి రామకృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తీన్మార్ మల్లన్న అగ్రవర్ణాల్లో ఎవరిని వదలకుండా అందరి మోచేతి నీళ్లు తాగారని ఇప్పుడు గణాంకాలు చూపుతూ బీసీల నాయకుడిగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. నీ గణాంకాలు ఎవరికి తెలియనివి కావని? జర్నలిస్టులందరికీ ఆ లెక్కలు తెలుసన్నారు. ఆయనంతట ఆయనే బీసీయూఎఫ్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్న.. ఇప్పుడు ఆయనంతట ఆయనే వెళ్లి కొత్త పార్టీ పెట్టుకున్నారని మండిపడ్డారు.

తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ ప్రకటించిన నేపథ్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన రామకృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తీన్మార్ మల్లన్న బీసీయూఎఫ్ పార్టీని ఆయనకు ఇవ్వాలని ఆయన్ను జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించాలని చాలా ప్రయత్నించినట్లు రామకృష్ణయ్య చెప్పారు. పార్టీ పేరులో బీసీ అని ఉండటంతో తనకు చాలా ఇష్టం అని పార్టీని తనకు ఇవ్వాలని కోరారని, ఈ విషయంలో మల్లన్న నా ఇంటికి కనీసం 7 సార్లు, సోమాజిగూడలోని కార్యాలయానికి రెండు సార్లు వచ్చారన్నారు..మా పార్టీని 2004 లో రిజిస్టర్ చేశామని అప్పటి నుంచి పార్టీని నడుపుతూ వస్తున్నామని మరి ఇప్పుడు పార్టీని మీకు అప్పగిస్తే మేమేం చేయాలని అడిగామని జాతీయ అధ్యక్షుడిగా మిమ్మల్ని నియమిస్తూ పార్టీని అప్పగించే ప్రసక్తే లేదని చెప్పామన్నారు..దాంతో మీ పార్టీ వద్దంటూ అక్కడి నుంచి వెళ్లిపోయిన మల్లన్న ఆ మరుసటి రోజు మళ్లీ నావద్దకు వచ్చి పార్టీలో చేరితే నాకు ఏ పదవి ఇస్తారని అడుగుతూ వచ్చారన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న మీకు చిన్న పదవి ఇస్తే బాగుండదని మా పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు లేదని అందువల్ల మల్లన్న కోసం ప్రత్యేకంగా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి పోస్టును క్రియేట్ చేసి ఈ ఏడాది ఆగస్టు 30న అపాయింట్ చేసినట్లు చెప్పారు. ఆయనంతట ఆయనే బీసీయూఎఫ్ పార్టీలో మల్లన్న చేరి ఇప్పుడు ఆయనంతట ఆయనే వెళ్లి కొత్త పార్టీ పెట్టుకున్నారని మండిపడ్డారు.

మాకు మేముగా ఎవరిని కూడా పార్టీలో చేరమని ఆహ్వానించిందేలేదు.. పదిహేను రోజుల క్రితం మా వద్ద నియామక పత్రం తీసుకుపోయి మాకే మూడు నామాలు పెట్టిన మీరు ఇతరులకు ఇంకెవరినీ మోసం చేస్తారని ప్రశ్నించారు. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టుకోవడంతో ఆయనను పార్టీ పదవి నుంచి తొలగిస్తూ ఈసీకి లేఖ రాస్తామన్నారు.. బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీకి ఇక నుండి తీన్మార్ మల్లన్నకు సంబంధంలేదని తెలిపారు..పార్టీలో పదవి ఇచ్చాక బీసీయూఎఫ్ ను తానే తీసుకున్నట్లు మల్లన్ననే యూట్యూబ్ లకు లీకులు ఇచ్చారని ఈ విషయం తనను బాధించిందని రామకృష్ణయ్య చెప్పారు. బీసీయూఎఫ్ ను మల్లన్న భారీ నగదు ఇచ్చి కొనుగోలు చేసినట్లు కూడా ప్రచారం చేయించారని అన్నారు. భవిష్యత్ లో మల్లన్న మా మధ్య ఏదో డీల్ జరిగిందని చెప్పే అవకాశం ఉందని అందువల్ల జరిగిన పరిణామాలను తాను మీడియా ముఖంగా చెప్పేస్తున్నానన్నారు…

గతంలో అగ్రవర్ణాలకు చెందిన పార్టీలు నాకు పదవుల ఆశలు చూపిన నేను కేవలం బీసీల వాదం వెనకే ఉంటానని పదవులను నిరాకరించానన్నారు..ఇప్పటికి అగ్రవర్ణాలకు పార్టీలకు నేను వ్యతిరేకమని చెప్పారు.. బీసీ యునైటెడ్ ఫ్రంట్ ద్వారా బీసీల వెంటే ఉంటాము రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాము అని అన్నారు.. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేకపోతుల నరేందర్ గౌడ్, కోశాధికారి లక్ష్మి, నేషనల్ కోఆర్డినేటర్ వెంకట్, వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిక్షపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story