అక్రమ స్పా సెంటర్‌పై వనస్థలిపురం పోలీసుల ఆకస్మిక దాడి

by Kodari Anjali |

నగరంలో అక్రమంగా నిర్వహిస్తున్న స్పా సెంటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

అక్రమ స్పా సెంటర్‌పై వనస్థలిపురం పోలీసుల ఆకస్మిక దాడి
X

దిశ, హస్తినాపురం: నగరంలో అక్రమంగా నిర్వహిస్తున్న స్పా సెంటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి ఓంకార్ నగర్‌లో ఉన్న "రిలైట్ వెల్ బ్యూటీ & స్పా ” పై పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఘటనకు సంబంధించి స్పా మేనేజర్‌తో పాటు యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 24 శుక్రవారం, సాయంత్రం విశ్వసనీయ సమాచారం అందడంతో వనస్థలిపురం ఎస్‌ఐ జి. గిరీష్ కుమార్ తన సిబ్బందితో కలిసి స్పా సెంటర్‌పై దాడి నిర్వహించారు.

చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి..

తనిఖీల సందర్భంగా ఒక మహిళా థెరపిస్ట్ పురుష కస్టమర్‌కు క్రాస్ మసాజ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే సంబంధిత స్పా సెంటర్ అవసరమైన అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు వెల్లడించారు. దీంతో స్పా మేనేజర్ సాయి సంతోష్ తో పాటు యజమాని బండావత్ శివ దుర్గను అదుపులోకి తీసుకుని విచారించారు. వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా స్పా సెంటర్ల పేరుతో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని వనస్థలిపురం పోలీసులు హెచ్చరించారు. ప్రజల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఇలాంటి తనిఖీలు మరింత విస్తృతంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు.

Next Story