- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రియల్ ఎస్టేట్ పడిపోలేదు.. గతం కంటే పెరిగింది: ఆధారాలతో స్పష్టం చేసిన పొంగులేటి
రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని కొంతమంది ఉద్దేశపూర్వకంగా గోబెల్స్ ప్రచారం సాగిస్తున్నారని దీనిలో ఏమాత్రం నిజం లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని కొంతమంది ఉద్దేశపూర్వకంగా గోబెల్స్ ప్రచారం సాగిస్తున్నారని దీనిలో ఏమాత్రం నిజం లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా స్పష్టమైన ఆధారాలు, వివరాలు ఉన్నాయని అందువలన అటువంటి ప్రచారాలను నమ్మాల్సిన అవసరం లేదని అన్నారు. శనివారం నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గత రెండున్నర సంవత్సరాల ప్రజా ప్రభుత్వ పాలనలో సుమారు 15 నుంచి 20 శాతం రియల్ ఎస్టేట్ అభివృద్ధి జరిగిందని , 40 శాతం వరకు ప్లాట్ల విక్రయాలు వృద్దిచెందాయని అన్నారు. గడిచిన పదేళ్లతో పోలిస్తే ఈ రెండున్నర ఏళ్లలో రెసిడెన్షియల్ మార్కెట్ విశేషంగా పెరిగిందని, దీనికి సంబంధించి తమ స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖలో పెరిగిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల సంఖ్యనే నిదర్శనమన్నారు. రియల్ ఎస్టేట్ పడిపోయిందని కొంతమంది పనిగట్టుకొని ఈ ప్రభుత్వంపై బురద చల్లేందుకు ఈ గోబెల్స్ ప్రచారం సాగిస్తున్నారని వాటిని పట్టించుకోవద్దని మంత్రి గారు అన్నారు.
అందరి దృష్టి హైదరాబాద్‌పైనే..
2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రుల చొరవ కారణంగానే హైదరాబాద్ ఒక రోల్ మోడల్‌గా రూపొందిందని, వారి దూరదృష్టి వల్లే ఓఆర్ఆర్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటి సెక్టార్ తదితరాలు 360 డిగ్రీల కోణంలో అభివృద్ది చెందాయని వివరించారు. అందువల్లే హైదరాబాద్ ఇప్పుడు దేశంలోనే గాక ప్రపంచంలోనే అందరి దృష్టిని ఆకర్షిస్తోందని, ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలసి దావోస్ వెళ్లినపుడు అక్కడ కూడా అధికశాతం పారిశ్రామిక వేత్తలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. హైదరాబాద్ నగరం పెట్టుబడులకు గమ్యస్థానం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టితో ప్రణాళికా బద్దంగా హైదరాబాద్ నగరాభివృద్దికి చర్యలు చేపట్టారు. 7 వేల కోట్లతో చేపడుతున్న మూసీ ప్రాజెక్ట్ సుందరీకరణ పట్టాలెక్కనుందని మంత్రి పొంగులేటి తెలిపారు. 28 కిలోమీటర్ల తొలి విడత అభివృద్దికి వారం పది రోజుల్లో టెండర్లు పిలవబోతున్నామని చెప్పారు. అదేవిధంగా పాత బస్తీ తదితరాలను కలుపుతూ రెండవ విడతగా 76 కిలోమీటర్ల మేర 24వేల కోట్లరూపాయిల ఖర్చుతో మెట్రో విస్తరణ కార్యక్రమం ప్రారంభం కానుందని తెలిపారు. ఇవేగాక త్రిబుల్ ఆర్ నుంచి ఓఆర్ఆర్ కలుపుతూ రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దమవుతున్నాయని తెలిపారు.
ఎస్టేట్ రంగం మరింత అభివృద్ధి..
ప్రపంచంలోనే సుందరనగరమైన హైదరాబాద్‌ను రియల్ ఎస్టేట్ రంగం పక్షాన కూడా మరింత అభివృద్ది చెందడానికి రియల్ ఎస్టేట్ రంగ ప్రతినిధులు సహకారం అవసరమని, ప్రజలకు నమ్మకంగా, సకాలంలో ప్లాట్లను అందించి వారి అభిమానాన్ని చూరగొనాలని మంత్రి హితవు పలికారు. రాష్ట్రంలో భూముల భద్రత, భరోసా కల్పించేందుకు భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని, వీటిలో కొన్ని చిన్న చిన్నసమస్యలను సాఫ్ట్ వేర్ పరంగా 15-20 రోజుల్లో సరిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. కేవలం రియల్ ఎస్టేట్ రంగం కోసమే గాకుండా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు క్యూర్ పరిధిలో తొలివిడతగా లక్ష ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు నిర్ణయించామని, దీని తర్వాత దఫదఫాలు ఇళ్ల మంజూరు ఉంటుందని మంత్రి చెప్పారు. ప్రజలకు ఇళ్ల నిర్మాణానికి 2-3 లక్షల చదరపు అడుగుల స్ధల సేకరణకు ప్రయత్నిస్తున్నామని చెబుతూ రియల్ ఎస్టేట్ రంగ ప్రతినిధుల కోరిక మేరకు ఫాస్ట్ ట్రాక్ సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రఘురామ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






