Sai Rajesh: అలా జరిగితే కొంతమంది డబ్బింగ్ రూములోకి కూడా రారు.. కిరణ్ మాత్రం ఫుల్ సపోర్ట్ చేశాడు

by Pulgam srinivas |

కిరణ్‌కి ఇప్పటికీ పారితోషకం బాకీ ఉన్నాను. అయినప్పటికీ ఆయన ఒక్కసారి కూడా ఆ విషయం ప్రస్తావించలేదని సాయి రాజేష్ తెలిపారు.

Sai Rajesh: అలా జరిగితే కొంతమంది డబ్బింగ్ రూములోకి కూడా రారు.. కిరణ్ మాత్రం ఫుల్ సపోర్ట్ చేశాడు
X

దిశ, వెబ్ డెస్క్: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ'. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందించగా, ఎస్‌కేఎన్‌తో కలిసి ఈ సినిమాను నిర్మించారు. జూలై 24న విడుదలైన ఈ చిత్రం తొలి షో నుంచే మంచి టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్‌ను నమోదు చేసింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం తాజాగా 'బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్' నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సాయి రాజేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సాయి రాజేష్ మాట్లాడుతూ.. నేను ఏ సినిమా చేసినా ప్రమోషన్స్ విషయంలో చాలా ఎక్కువగా ఆలోచిస్తుంటాను. కానీ 'చెన్నై లవ్ స్టోరీ' విషయంలో నాకు ఆ బాధ్యత చాలా వరకు తగ్గింది. అందుకు ప్రధాన కారణం కిరణ్ అబ్బవరం. సినిమా ప్రారంభమైన రోజు నుంచే ఆయన ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా నమ్మారు. ప్రచార బాధ్యతలను కూడా తన భుజాలపై వేసుకుని ఎంతో అంకితభావంతో ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. మేము చిన్న నిర్మాతలం. 'బేబీ' సినిమా తర్వాత కిరణ్‌కు ఈ కథ చెప్పగానే, ఆయన కథను మాత్రమే కాదు మమ్మల్ని కూడా నమ్మి ఈ సినిమాను ముందుకు నడిపించారు.

ఈ చిత్రంలో కిరణ్ కేవలం హీరో మాత్రమే కాదు... దర్శకుడు, నిర్మాత, కథా రచయిత అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. సినిమా నిర్మాణ సమయంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా ఒక్కరోజు కూడా తన పారితోషకం గురించి కిరణ్ అడగలేదు. ఇప్పటికీ ఆయనకు రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి ఉంది. అయినప్పటికీ ఆయన ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. కొంతమంది పారితోషకం అందకపోతే డబ్బింగ్ రూమ్‌లోకి కూడా అడుగుపెట్టరు. కానీ కిరణ్ అలాంటి వ్యక్తి కాదు. ప్రతి దశలో మాకు అండగా నిలిచారు. ఆయన నమ్మకం, సహకారం వల్లే ఈ సినిమా విడుదలై నేడు మంచి విజయాన్ని అందుకుందని సాయి రాజేష్ చెప్పుకొచ్చారు.

Next Story