- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లా అధికారుల అండదండలతోనే కేసముద్రం రైస్ మిల్లుల్లో ధాన్యం మాయం..?
కేసముద్రం మండలంలోని కొన్ని రైస్ మిల్లుల్లో ధాన్యం కేటాయింపులు, నిల్వలు, రవాణా, సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) అప్పగింతల ప్రక్రియలో భారీ అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దిశ, కేసముద్రం : మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలంలోని కొన్ని రైస్ మిల్లుల్లో ధాన్యం కేటాయింపులు, నిల్వలు, రవాణా, సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) అప్పగింతల ప్రక్రియలో భారీ అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో జిల్లా స్థాయి అధికారుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు మిల్లు యజమానులు, వ్యాపార వర్గాలు, రైతు సంఘాల నుంచి వ్యక్తమవుతున్నాయి. వ్యాపార వర్గాల కథనం ప్రకారం, ధాన్యం కేటాయింపుల కోసం సంబంధిత జిల్లా స్థాయి అధికారులకు భారీ మొత్తంలో అక్రమంగా డబ్బులు చెల్లించాల్సి వస్తోందని ప్రచారం జరుగుతోంది. లక్షల రూపాయల తాయిలాలు అందిన తర్వాతే ధాన్యం కేటాయింపులు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే కేటాయించిన ధాన్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాలకు తరలించడం, రికార్డుల్లో ఒక విధంగా నమోదు చేసి వాస్తవంగా మరో విధంగా చూపించడం ద్వారా ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లుతోందని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు మిల్లర్లు, జిల్లా స్థాయి అధికారులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ధారణ వెలువడలేదు. సంబంధిత అధికారులు కూడా దీనిపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో రైతు సంఘాలు, ప్రజా సంఘాలు జిల్లా స్థాయి విచారణతో కాకుండా హైదరాబాద్ విజిలెన్స్ ప్రత్యేక బృందాలతో కేసముద్రంలోని అన్ని రైస్ మిల్లులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ధాన్యం కొనుగోలు రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, సీఎంఆర్ లెక్కలు, రవాణా పత్రాలు, గోదాముల్లోని నిల్వలను సమగ్రంగా పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొంటున్నాయి. ఆరోపణల్లో నిజానిజాలు తేల్చేందుకు స్వతంత్ర విచారణ చేపట్టి, అక్రమాలు జరిగినట్లు తేలితే సంబంధిత అధికారులు, మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు స్పందించి వాస్తవ పరిస్థితిని వెల్లడించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






