1000 లీటర్ల బెల్లం పానకం, 30 లీటర్ల గుడుంబా స్వాధీనం

by Kodari Anjali |

నేరస్తుల కదలికలపై ముమ్మర నిఘా వ్యవస్థను పటిష్టం చేసినట్లు జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు అన్నారు.

1000 లీటర్ల బెల్లం పానకం, 30 లీటర్ల గుడుంబా స్వాధీనం
X

దిశ, మంచిర్యాల: నేరస్తుల కదలికలపై ముమ్మర నిఘా వ్యవస్థను పటిష్టం చేసినట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం జైపూర్ మండలం ఎసన్వాయి గ్రామంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించారు. 50 మంది పోలీసు అధికారులు, 30 మంది ఎక్సైజ్ శాఖ సిబ్బందితో కలిసి గ్రామంలోని ప్రతి ఇంటిని సోదాలు చేశారు. గ్రామంలో నివసించే వారి వివరాలతో పాటు కొత్త వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారా అనే కోణంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలతో పాటు ఐదు ఆటో లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలోని గుడుంబా ప్రభావిత ప్రాంతాలపై ఎక్సైజ్ పోలీసులు, సివిల్ పోలీసుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 1000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు.

వాహనదారులు తప్పనిసరిగా...

గుడుంబా తయారీదారుల నుండి 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకొని తొమ్మిది మంది పై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ నేరస్తుల కదలికలపై నిఘాను ముమ్మరపు చేసినట్లు పేర్కొన్నారు. నేర రహిత సమాజమే లక్ష్యంగా గ్రామాల్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలలో భద్రత భావాన్ని పెంపొందించడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కు పాదం మోపడమే ముఖ్య ఉద్దేశం అన్నారు. వాహనదారులు తప్పనిసరిగా అన్ని రకాల పత్రాలను కలిగి ఉండాలని అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్.కృష్ణ, ఎక్సైజ్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ శ్రీరామ్ రెడ్డి, కోటపల్లి, నీల్వాయి ఎస్సైలు, ట్రైనీ ఎక్సైజ్ సీఐలు సమ్మయ్య, అక్బర్ హుస్సేన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story