గ్రేటర్‌ హైదరాబాద్ లో అప్రకటిత విద్యుత్ కోతలు

by velandi.Saikiran |   (  Updated:2026-03-30 21:15:03  IST  )

గ్రేటర్ హైదరాబాద్‌లో విధిస్తున్న అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్ లో అప్రకటిత విద్యుత్ కోతలు
X

గ్రేటర్‌ హైదరాబాద్ లో అప్రకటిత విద్యుత్ కోతలు

- దంచికొడుతున్న ఎండలు

- రోజూ సగటున 35 డిగ్రీల పైమాటే..

- ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి

- - పట్టించుకోని అధికారులు

దిశ, హైదరాబాద్ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో విధిస్తున్న అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఓ వైపు మండుతున్న ఎండలు, మరోవైపు కరెంట్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ వ్యాప్తంగా సుమారు 35 డిగ్రీల సెల్పియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోండి అంటూ ప్రతినిత్యం వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తుండగా ప్రజలు ఇండ్లలో కూడా ఉండలేని విధంగా కరెంట్ కోతలు ఉంటున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండడం, గంటల పాటు విద్యుత్ అధికారులకు ఫోన్లు చేసినా పట్టించుకోకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. దీనికి తోడు అకాల వర్షాలు, గాలులతో పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

అనధికారికంగా కోతలు..

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా మొదలైంది. సుమారు రెండున్నరేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రంలో ఒక్క నిమిషం విద్యుత్ కోతలు విధించినా అధికారులపై చర్యలుంటాయని సీఎం రేవంత్ రెడ్డి సైతం హెచ్చరికలు జారీ చేశారు. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు పని చేస్తున్నారు. కొన్ని రోజులుగా నగర వ్యాప్తంగా తరచుగా కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. అనధికారికంగా కోతలు విధిస్తున్నారు. అంతరాయానికి కొంత మంది అధికారులు చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా విద్యుత్ నిలిపేస్తున్నామని చెబుతున్నారు. ఇలా నగరంలోని చాలా ప్రాంతాల్లో రోజులో అనేకమార్లు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తుండడం పరిస్థితికి అద్దం పడుతుండగా.. వినియోగదారులకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులున్నాయి.

పట్టించుకోని అధికారులు..?

ప్రస్తుత వేసవిలో జీహెచ్ఎంసీ పరిధిలో తరచుగా విద్యుత్ కోతలు ఉంటుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వీఐపీలు, సంపన్నులు ఉండే ప్రాంతాల్లో ఒకవేళ ఏదేని సాంకేతిక కారణాలతో సరఫరా నిలిచిపోతే వెంటనే పునరుద్ధరిస్తున్న అధికారులు.. ఇతర ప్రాంతాల్లో పట్టించుకోవడం లేదు. గంటల పాటు విద్యుత్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఫ్యూజ్ ఆఫ్ కాల్‌తో పాటు ఏఈ, లైన్‌మెన్‌లకు ఫోన్ చేసినా స్పందించడం లేదని, కొంతమంది అధికారులు అసలు ఫోన్ కూడా ఎత్తకపోవడంపై బస్తీల ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఎల్బీ నగర్‌లోని చాలా బస్తీల్లో సమస్య జఠిలంగా ఉంది. ఒక్కోసారి రోజులో పదుల సార్లు విద్యుత్ నిలిచిపోతున్నది. హైదరాబాద్ నగరంలో అనధికార కోతలు విధిస్తూనే 24 గంటలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

చెడిపోతున్న గృహోపకరణాలు..

విద్యుత్‌ సరఫరాలో హెచ్చుతగ్గులు కూడా ఉండడంతో గృహోపకరణాలు కూడా పాడవుతున్నాయని పలువురు వాపోతున్నారు. తరచుగా కరెంటు వస్తూ, పోతూ ఉండడంతో ఇండ్లలో టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఇతర విద్యుత్ వస్తువులు చెడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని గతంలో మాదిరి నిరంతరం కరెంట్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రేటర్ వాసులు కోరుతున్నారు. నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


Next Story